జగన్ కి ఈ వికృత ఐడియాలు ఎవరిస్తారు?

June 02, 2020

ప్రజావేదిక కూల్చడం మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్నీ ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమం అంటూ చెబుతున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కు నెడుతున్నాయి. ఒక మొక్క నాటితే రేపటి తరానికి నీడ ఇస్తుంది. ఇదే అభివృద్ధి లాజిక్. ప్రభుత్వం తన దగ్గర ఉన్నదంతా పంచితే భవిష్యత్తులో ఏం చేస్తుంది? ప్రభుత్వం చేసే ప్రతి పని సమాజోద్ధరణ, భావి తరాల అభివృద్ధి, ఉపాధి సృష్టికి దారితీసేలా ఉండాలి. కానీ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ సర్కారు డబ్బులతో తన పార్టీకి క్రెడిట్ వచ్చేవిగా ఉంటున్నాయి గాని ఏపీ భవితను నిర్మించేవిగా ఉండటం లేదు.

తాజాగా జగన్ విధానాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అసలు జగన్ కి ఇలాంటి వికృతి, సైకో ఐడియాలు ఎవరు ఇస్తున్నారు ? అని విస్మయం వ్యక్తంచేశారు. ఒక పేదవాడిని రోడ్డున పడేసి మరో పేదవానికి గూడు ఇవ్వడం ఏంటి? ప్రభుత్వానికి చేతనయితే తన శక్తి, తన వద్ద ఉన్న వనరులతో పేదలకు సాయం చేయాలి. ఒకర్ని కొట్టి ఇంకొకడికి పెట్టే పిచ్చిపని ఏంటి అంటూ నిలదీశారు. దీనిపై ట్విట్టరులో చంద్రబాబు నిలదీశారు. 

‘‘పేదలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే ప్రభుత్వం తరపు నుంచి చేయాలి. అంతేకానీ ఒక పేదకు మంచి చేయడానికి ఇంకో పేదకు జీవనాధారం లేకుండా చేయడం ఏంటి? మీ ప్రచారం కోసం తాతల కాలం నాటి నుంచీ ఎస్సీ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న భూముల్ని లాక్కుని వాళ్ళకు అన్యాయం చేస్తారా?  ఇల్లు పీకి పందిరేసే ఇలాంటి వింత ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన గృహాలను పేదలకు పంచండి. సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలను పూర్తిచేయండి’’ అని ట్విట్టరులో చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.