ఎంతమంది డాక్టర్లను సస్పెండ్ చేస్తావు జగన్?

June 03, 2020

కరోనాపై పోరాటంలో భాగంగా ప్రాణాలకు తెగించి మరీ డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది...కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. మన దేశంలో డాకర్లు, వైద్య సిబ్బందికి సరిపడినన్ని పీపీఈలు, మాస్కులు లేకపోయినప్పటికీ....తమ లైఫ్ ను రిస్క్ లో పెట్టి మరీ తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. అయితే, పీపీఈలు తగినన్ని లేవని, తాము వైద్యం చేయడం కష్టంగా ఉందని వైద్యులు వాపోతున్నారు. ఏపీలో పీపీఈలు, మాస్కుల కొరత ఉందని వార్తలు వస్తున్నాయి.

నర్సీపట్నంలోని ఓ వైద్యుడు స్వయంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్టిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత అతడు టీడీపీ సానుభూతిపరుడని అతడిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. త‌మ‌కు ఆసుప‌త్రుల్లో మాస్కులు అందుబాటులో లేని నేప‌థ్యంలో వాటి కొనుగోలు కోసం విరాళాలు ఇవ్వాలంటూ జూనియ‌ర్ డాక్ట‌ర్ల సంఘం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మరోవైపు, కృష్ణా జిల్లాలో వైద్య శాల‌ల‌కు వెళ్లాల్సిన ఎన్-95 మాస్కులు, ఇత‌ర సామ‌గ్రిని వీఐపీల కోసం త‌ర‌లించిన‌ట్లు నేష‌న‌ల్ మీడియాలోనూ వార్త‌లొచ్చాయి. తాజాగా, మాస్క్‌లు, పీపీఈ కిట్స్‌ అందజేయకుంటే తాము విధులు నిర్వహించలేమని అనంతపురం జీజీహెచ్ లోని జూనియర్‌ డాక్టర్లు స్పష్టం చేశారు.

కరోనా ఐసోలేషన్‌ వార్డులో సేవలందిస్తున్న సిబ్బందికి తప్ప మిగిలిన వారికి ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేయడంతో వారంతా విధులు బహిష్కరించి తమ నిరసన తెలియజేశారు. ఈ ప‌రిణామాల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డాక్ట‌ర్లు, వైద్య సిబ్బందిలో ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక ధోర‌ణి క‌నిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైద్యుల సమస్యలపై దృష్టి సారించాలని సీఎం జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. జగన్ కు పలు సూచనలు చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు సేవలందిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వైద్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు తగిన పరికరాలు సరఫరా చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వృద్ధుడికి చికిత్స అందించిన ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని చంద్రబాబు చెప్పారు. సరైన రక్షణ పరికరాలు లేని దుస్థితిని ఈ ఘటన తెలియజేస్తోందని, ఇప్పటికైనా వైద్య సిబ్బందికి భరోసా కల్పించే రక్షణ పరికరాలు ఏర్పాటు చేయాలని జగన్ కు సూచించారు. పీపీఈల కోసం ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చంద్రబాబు కోరారు. పీపీఈలు లేవని వీడియోలు పెట్టిన డాక్టర్లను సస్పెండ్ చేయడం సరికాదని, ఇలా ఎంతమంది డాక్టర్లను సస్సెండ్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

పీపీఈలు లేకుండా ట్రీట్ చేస్తే తమ ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్లు మొత్తుకుంటున్నారని, డాక్టర్లవి ప్రాణాలు కావా అని అన్నారు. ఇటువంటి కష్టసమయంలో డాక్టర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు. కాగా, ఇప్పటికే చంద్రబాబు ముందు చూపుతో విశాఖలో ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ లో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, మాస్కులు, వెంటిలేటర్లు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అక్కసుతో గతంలో జగన్ నిర్లక్ష్యం చేసిన మెడ్ టెక్ నేడు ఆయన పాలిట వరంగా మారింది.