వైసీపీ నేతలు..రాక్షసులు

May 26, 2020

పల్నాడు ప్రాంతంలో మరోసారి ఫ్యాక్షన్ తరహా దాడులు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాలోని మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మొదట వారి వాహనంపై రాళ్లు రువ్విన వైసీపీ కార్యకర్తలు....ఆ తర్వాత వాహనాన్ని అటకాయించి కర్రలతో దాడి చేశారు. అక్కడ నుంచి తప్పించుకొని పోలీసుల వాహనంలో వస్తోన్న వీరిపై మరోసారి దాడి చేశారు. స్వల్ప వ్యవధిలో మూడు సార్లు దాడులు జరగడంతో ఏపీలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.తమ నేతలపై దాడి ఘటనను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. 

ఏపీలో వైసీపీ వైసీపీ నేతలు రాక్షసులను మరిపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మాచర్లలో బోండా ఉమ కారుపై వైసీపీ రౌడీలు వెంబడించి మరీ దాడి చేశారని నిప్పులు చెరిగారు. మొదట కారుపై రాళ్లడాడి చేశారని, ఆ తర్వాత కర్రలతో దాడి చేశారని....మూడో సారి మాచర్ల నుంచి వెల్దుర్తికి వెళ్లి సీఐ కారులో వస్తుంటే మళ్లీ దాడి చేశారని మండిపడ్డారు. ఇలా పదేపదే దాడుల చేయడం వైసీపీరౌడీలకు మాత్రమే సాధ్యమని చంద్రబాబు ఆరోపించారు. మాచర్లలో పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన లాయర్‌ కిశోర్‌పై కూడా దాడికి పాల్పడ్డారని చెప్పారు.  

మాచర్లలో పోలీసుల వాహనంపై దాడి జరిగిందని, ఈ ఘటనపై ఏపీ డీజీపీ ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. మనుషులను చంపేసి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని వైసీపీపై మండిపడ్డారు. టీడీపీ నేతలపై దాడులు జరిగితే డీజీపీ చర్యలు తీసుకోరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలపై దాడుల గురించి మూడు రోజులగా ఫిర్యాదులు చేస్తుంటే పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కశ్మీర్‌, బిహార్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని , పులివెందుల పంచాయితీలు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

వైసీపీ దౌర్జన్యాలను గుర్తించి స్థానిక సంస్థల ఎన్నికల్లో  ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్యాస్ట్‌, నో డ్యూస్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థులను వేధిస్తున్నారని, పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారని  మండిపడ్డారు.  వైసీపీ నేతలకు పోలీసులు, అధికారులు సహకరిస్తున్నారని, నిన్న నామినేషన్‌ వేస్తే ఇవాళ పత్రాలు చించివేశారని ఆరోపించారు.  ఈ దాడి ఘటనను టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. వైసీపీ రౌడీ మూకలు ఆ దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు టీడీపీక కీలకమైన నేతలను హత్య చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. హైకోర్టు అడ్వకేట్ కిషోర్‌పై కూడా ఘోరంగా దాడి చేశారని , ఏపీలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ కార్యకర్తలు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.పోలీసులపైనా వైసీపీ రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చిందని, బిహార్‌ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో జగన్ పాలనలో ఉండడం దురదృష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు.