వాళ్లెవరో పొత్తు పెట్టుకుంటే... నీకెందుకు బాబు?

July 04, 2020

ఎన్నికల ముందు పొత్తులు విచత్రంకాదు. కానీ ఎన్నికలతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాల్లో పొడిచిన పొత్తులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గతంలో బీజేపీతో కలిసి నడిచిన జనసేన మధ్యలో ఆ పార్టీకి దూరమైంది. మధ్యలో యాంటీ బీజేపీ పార్టీలతో చేతులు కలిపింది. మళ్లీ ఏపీలో పరిస్థితుల నేపథ్యంలో పాత స్నేహబంధాన్ని జనసేన స్నేహహస్తం చాచింది. దీంతో బీజేపీ - జనసేన మళ్లీ ఒక్కటై నడవాలని నిర్ణయించుకున్నాయి. ఇది అటు వైసీపీకి, ఇటు టీడీపీకి ఇద్దరికీ దెబ్బే అనే విశ్లేషణలు నడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు స్పందన ఆసక్తికరంగా మారింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... పొత్తును స్వాగతించారు. అయితే, ఇది టీడీపీ కేడర్ కు పెద్దగా రుచించలేదు. 

అయితే, జనసేనతో కలవాలి. లేకపోతే దూరంగా ఉండాలి. కానీ ఈ సానుభూతి స్పందనల వల్ల ఇరు పార్టీలకు నష్టమే తప్ప లాభం లేదన్నది కేడర్ అభిప్రాయం. కానీ చంద్రబాబు ఆ పొత్తును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వ్యతిరేకించాల్సిన అవసరమూ లేదు. స్వాగతించాల్సిన అవసరమూ లేదు. అది ఆయా పార్టీల వ్యక్తిగత విషయం అని వదిలేస్తే సరిపోతుంది. కానీ మాటిమాటికీ ఆ పార్టీ మీద చంద్రబాబు వెలిబుచ్చే అభిప్రాయాలు జగన్ కి ప్లస్ అవుతున్నాయి. విజయసాయిరెడ్డి వంటి వారు ఒకవైపు ప్యాకేజీ అనే దుష్ర్పచారంతో దూసుకుపోతున్నపుడు ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి ఏం ప్రయోజనమో చంద్రబాబే ఆలోచించుకోవాలి.  

చంద్రబాబు మరో మాట కూడా అన్నారు. ‘సంతోషమే. ఆ రెండు పార్టీలు కలిసి అమరావతిలోనే రాజదాని ఉండేలా కృషి చేస్తే మంచిదే. రాజధాని విశాఖకు తరలిపోకుండా ఆ కూటమి పనిచేస్తే... దానిని నేను స్వాగతిస్తాను’ అని అన్నారు.  ఏపీలో చాలా స్వల్ప ప్రభావం చూపుతున్న ఆ రెండు పార్టీలు అమరావతిని ఆపాలని బాబు అర్థిస్తున్నట్టు అర్థం వచ్చేలా ఉందా కామెంట్. ఇలాంటి వ్యాఖ్యలు ప్రత్యర్థుల విమర్శలకు తప్ప... పార్టీకి పనికొచ్చేవి కాదు. ఏపీకి దశదిశ చూపి తెలుగుదేశం పార్టీ వంటి బలమైన పార్టీ ఇంకొక ప్రత్యర్థి బలం బహిరంగంగా గుర్తించడమే రాజకీయ తప్పిదం.