అమరావతిని రాజధాని ఎందుకు చేశానంటే: చంద్రబాబు

February 25, 2020

విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో ఎంతో ముందుకు వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్ అనేక బాలారిష్టాలను అనుభవించింది. మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లోటు నుంచి మంచి వృద్ధి రేటు సాధించి దూసుకెళ్లింది. అయితే కేంద్ర సహాయం అంది ఉంటే... ఇంకా మంచి స్థానంలో ఉండేది. దశాబ్దాల క్రితమే కట్టాల్సిన పోలవరం కూడా విభజిత ఏపీ ఖజానాపై భారం పడటం, కొత్త రాజధాని కట్టాల్సి రావడంతో ఏపీ సర్కారుకు చేతిలో డబ్బాడలేదు. దీంతో ఎన్ని చేసినా ఇంకా అనేక పనులు పెండింగ్ పడ్డాయి. మోడీ మాట తప్పడంతో అమరావతి మధ్యలో ఆగిపోయింది. 5 లక్షల కోట్లు అవసరమే అని బాబు మాటకు మద్దతు పలికిన మోడీ ... అధికారంలోకి వచ్చాక 50 వేల కోట్లు కాదు కదా 5000 కోట్లు కూడా చేతికి ఇవ్వలేదు. దీంతో అమరావతి అనుకున్నంత పూర్తికాలేదు.

ఇక మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాక... జగన్ చంద్రబాబు మీద కక్షతో ప్రధాని మోడీ కంటే కూడా ఎక్కువగా అమరావతిని నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రే రాజధానిని నిర్లక్ష్యం చేయడంతో అమరావతి అభివృద్ధి స్తంభించి పోయింది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. రాష్ట్రం మొత్తం జగన్ నిర్లక్ష్యంపై గుర్రుమనడంతో రాజధానిని మార్చాలనుకున్న జగన్ యుటర్న్ తీసుకుని తాజాగా సంచలన ప్రకటన చేశారు. 

ఏపీకి దక్షిణాఫ్రికా మోడల్ లో మూడు రాజధానులు ఏర్పాటుచేస్తామని.. సభలో ప్రకటించారు. అయితే... రాజధానిపై అధ్యయానికి రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించామని... అవి అందాక పూర్తిస్థాయి నిర్ణయం ప్రకటిస్తామని జగన్ చెప్పారు. చంద్రబాబు ఏదైతే చేస్తున్నారో దానికి జగన్ కొంత కలర్ యాడ్ చేశారు. అమరావతి ఇకపై కూడా రాజధానిగా కొనసాగనుందని జగన్ ప్రకటించారు. అయితే... వైజాగ్ లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నందున దానిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారిస్తే బాగుంటుందని, అలాగే జుడీషియల్ క్యాపిటల్ గా కర్నూలును ఎంపిక చేస్తే... ఏపీలోని మూడు ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వాస్తవానికి చంద్రబాబు చేసింది కూడా ఇదే. కాకపోతే ఏపీకి ఒక మహానగరం ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని మాత్రమే చంద్రబాబు ప్రమోట్ చేశారు. వైజాగ్ ను ఉపాధి, ఉద్యోగ కల్పన నగరంగా తీర్చిదిద్దారు చంద్రబాబు. పట్టుబట్టి హబ్ తో కూడిన అంతర్జాతీయ ఎయిర్ పోర్టును వైజాగ్ సమీపంలోని భోగాపురంలో కట్టిస్తున్నది కూడా అందుకే. చంద్రబాబు దానిని అంతర్జాతీయ నగరాన్ని చేయడానికి అంతర్జాతీయ సంస్థ అయిన లులు గ్రూపునకు పెద్ద కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి స్థలం ఇస్తే దానిని వెనక్కు తీసుకున్నారు జగన్. చంద్రబాబు వైజాగ్ విషయంలో ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు కాబట్టే రాష్టంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా వైజాగ్ లో మాత్రం నాలుగుసీట్లు గెలిచింది. ఇపుడు జగన్ ప్రటకనతో ఎమోషన్ తప్ప అక్కడ కొత్తగా ఒరిగేదేం లేదు. 

ఇక కర్నూలు విషయంలో కూడా ఓర్వకల్లు ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలువచ్చేలా ప్లాన్ చేశారు. ఎయిర్ పోర్ట్ రెడీ చేశారు చంద్రబాబు. కేవలం 18 నెలల్లో ఎయిర్ పోర్టు కట్టించారు. అతిపెద్ద సోలార్ పార్క్ ఏర్పాటుచేశారు. 

అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తూనే ... అమరావతిని మాత్రమే ప్రపంచానికి చెబుతూ వచ్చాడు. దీనికి ఓ కారణం ఉంది. ఆ రహస్యాన్ని చంద్రబాబు ఈరోజు వెల్లడించారు. అయిదేళ్ళ క్రితం రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ వేరుపడితే …తాను అన్నీ ఆలోచించే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేశామన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి ఒక ఆశగా కనిపించాలి, ఓ దిక్సూచిగా నిలవాలనే ఉద్దేశంతో దీని చుట్టూ సంపద సృష్టించాలన్న సంకల్పంతోనే అమరావతిని ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ప్రపంచానికి దానిని ప్రత్యేక చూపిస్తేనే దాని చుట్టు భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, పెట్టుబడులు రాబట్టవచ్చని చంద్రబాబు వెల్లడించారు. 30 వేల ఎకరాలు తగ్గకుండా రాజధాని కట్టాలని 2014లో చెప్పిన జగన్ ఇపుడు మాట మార్చారు అని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి ఒక సామాజిక వర్గం కోసం ఏర్పాటుచేసినట్టు దష్ప్రచారం చేశారని.. అక్కడ మెజారిటీ ప్రజలు బలహీన వర్గాల వారే అని చంద్రబాబు వివరించారు.