ఢిల్లీ లో బాబు ట్విస్ట్ - 21 పార్టీల మద్దతు

November 17, 2019

70 ఏళ్లు వచ్చినా బాబుకు ఎంత ఓపికో. లేకపోతే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసి 120 సభల్లో పాల్గొన్నారు. పొద్దునంతా ప్రచారం, రాత్రి సమీక్షలు, వ్యూహాలు, బుజ్జగింపులు వెరసి ఒకటిన్నర నెల తీరిక లేని పరిస్థితి. కనీసం ఎన్నికల అనంతరం అయినా ప్రశాంతంగా ఉంటాడేమో అనుకున్నారు. ఒకవైపు ప్రతిపక్ష నేత రిలాక్సయ్యి ప్రశాంతంగా సేదతీరుతుంటే... చంద్రబాబు ఢిల్లీ బాట పట్టి... అక్రమాలతో నిండిపోయిన ఎన్నికల కమిషన్ పై యుద్ధం ప్రకటించారు.
ప్రస్తుత ఎన్నికల్లో ఎపుడూ లేనంతగా అత్యధిక స్థానాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై పోరాటం మొదలుపెట్టారు.
ఆయన పోరాటానికి దేశంలోని 21 రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో పోరాటం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. వీవీ ప్యాట్లు 50 శాతం లెక్కించాలని గతంలో చంద్రబాబు ఆధ్వర్యంలో కోర్టుకు వెళితే ఒకటి నుంచి 5కు మాత్రమే పెంచారు. అయితే... 5 అనేది చాలా చిన్న సంఖ్య యాభై శాతం వీవీ ప్యాట్ల లెక్కించాల్సిందే అంటూ మళ్లీ కేంద్ర ఎన్నికల కమిషన్, ఈవీఎంల పనితీరును తప్పు పడుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు ఇతరులతో రివ్యూ పిటిషన్ వేయబోతున్నారు. ఈవీఎంలను ఎలా బోల్తా కొట్టించవచ్చో.. తమ పార్టీ నాయకులు హరిప్రసాద్ చౌదరి ఇదివరకే నిరూపించారని చంద్రబాబు వివరించారు. బ్యాలెట్ పేపర్ల వ్యవస్థను పునరుద్ధరించకపోతే ప్రజాస్వామ్యం మనుగడ కష్టమవుతుందని చంద్రబాబు అన్నారు.
ఆదివారం ఉదయం జాతీయ పార్టీల నాయకులతో భేటీ అయిన చంద్రబాబు ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీ ప్యాట్ల విషయంలో పోరాటంపై చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ఆ పార్టీ నాయకుడు సంజయ్‌ సింగ్‌ తదితరుల పాల్గొనగా... చంద్రబాబు ఎన్నికల సంఘం తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ మాట్లాడారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల సిబ్బంది 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించడానికి నిరాకరించడం బట్టి చూస్తే ఎన్నికల సంఘాన్ని అనుమానించాల్సి వస్తుందన్నారు. నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం వల్ల ఉపయోగం లేదన్నారు.అందుకే సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. జర్మనీ వంటి టెక్నాలజీతో నడిచే అభివృద్ధి చెందిన దేశాలు సైతం బ్యాలెట్‌ పద్ధతిని అనుకరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏపీలో ఎన్నికలు ముగిశాయని, అయినా ప్రజాస్వామ్యం కోసం ఈవీఎంల పనితీరుపై పోరాడుతున్నానని చెప్పారు. ఏపీలో పోలింగ్ సందర్భంగా 4583 ఈవీఎంలు పనిచేయకుండా ఎందుకు మొరాయించాయో ఎన్నికల సంఘం వద్ద కారణాలున్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇంత బాధ్యతారాహిత్యమైన అధికారులను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఈవీఎంల పనితీరులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదివరకు ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటీషన్ వేస్తామని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై బటన్ నొక్కితే, మరో పార్టీకి ఓటు పడటం అంటే ఇలాంటి తప్పులు ఉన్నపుడు వాటిని ఉపయోగించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.