జగన్ ని చూశాక... బాబు పాల‌న గురించి కేంద్ర‌మంత్రులు ఏమన్నారంటే..

February 24, 2020

మంచిప‌ని ఎవ‌రు చేసినా పొగడాలి... అది శ‌త్రువైనా, ప్ర‌త్య‌ర్థి అయినా అంటూ  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  చంద్ర‌బాబు సాగించిన తొలి ఐదేళ్ల పాల‌న‌ను కేంద్ర‌మంత్రులు గుర్తు చేసుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో కేంద్రంకు వెళ్లాల్సిన ప‌న్నుల్లో కోత‌ప‌డుతుండ‌ట‌మే కాక‌..చాలా వ‌ర‌కు పెండింగ్‌లో ఉంటున్నాయ‌ట‌. దీంతో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి క‌న్నా చంద్ర‌బాబే న‌యం సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా దృష్టి సారించార‌ని ఇప్పుడు కేంద్ర మంత్రులు త‌ర‌చూ చ‌ర్చ‌లు పెడుతున్నార‌ట‌.
వీళ్లు ఇంత‌లా బాబు పాల‌న గుర్తు చేసుకోవ‌డానికి చాలా కార‌ణాలే ఉన్నాయి. అప్ప‌ట్లో నెల‌నెలా కేంద్రానికి వేల కోట్ల ప‌న్నులు రాబ‌డి ఉండేది...ఇప్పుడు మ‌రీ దారుణంగా త‌యారైంద‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌వ‌డానికి వెళ్లిన ఎంపీలు, పార్టీల నేత‌ల‌తో కేంద్ర‌మంత్రులు వాపోతున్నార‌ట‌. వాస్త‌వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో రాష్ట్రానికి ఆదాయం విషయంలో ఎక్క‌డా ఇబ్బందులు త‌లెత్త‌కపోవ‌డం గ‌మ‌నార్హం. న‌వ్యాంధ్ర పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టిన చంద్ర‌బాబు అమ‌రావతిలో  రాజ‌ధాని నిర్మాణం స‌హ పారిశ్రామిక‌, ఐటీ రంగాల్లో అభివృద్ధికి వేగంగా నిర్ణ‌యాలు తీసుకున్నారు.  
చాలా ప‌క‌డ్బందీగా పునాదులు వేశారు. వాటి ద్వారా వ‌చ్చే ఆదాయంతో మౌలిక రంగాల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేశారు. ఎన్డీఏకు దూర‌మై... బీజేపీతో రాజ‌కీయ విబేధాలు కొన‌సాగుతున్నా కూడా ఢిల్లీకి వెళ్తే ఏదో ఒక‌టి రాష్ట్రానికి సాధించుకుని వెళ్లేవారు. ఇది బాబు రాజ‌కీయ నైపుణ్యానికి నిద‌ర్శ‌నం. జ‌గ‌న్ వ‌రాల పాల‌న సామాన్యుల‌కు సంబురంగానే ఉన్నా...మేధావుల్లో, అభివృద్ధి కాముకుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.  అప్పు చేసి ప‌ప్పు కూడు అన్న‌ట్లుగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాల‌న సాగుతోంద‌న్న విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.
కేవ‌లం సంక్షేమంపైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అభివృద్ధిపై శీత‌క‌న్ను ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌పై  జ‌నంలో కొంత పెద‌విరుపు మొద‌లైంది.  అభివృద్ధి ప‌నులు ముందుకు సాగ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ పాల‌న‌లో అనుభ‌వలేమి కొట్టొచ్చినట్లు క‌న‌బ‌డుతోంద‌ని, ఇలా అయితే ఆర్థికంగా మ‌రిన్ని ఇబ్బందుల‌ను ఎదుర్కొవాల్సిన ప‌రిస్థితులు రావ‌డ‌మే కాకుండా అభివృద్ధిలో వెన‌క‌బ‌డిపోతుంద‌ని కేంద్ర‌మంత్రులు హెచ్చ‌రిస్తున్నార‌ట‌.