బాబు సెక్యూరిటీపై డీజీపీ షాకింగ్ వ్యాఖ్యలు

April 02, 2020

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. నెలరోజుల్లో రెండు సార్లు భద్రతను కుదించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది. కానీ ప్రస్తుతం కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన రెండు బృందాలు రెండు షిఫ్టుల్లో పనిచేస్తాయి. దీనిపై టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం చర్యలు కక్ష సాధింపు అని ఆరోపించారు.

ఈరోజు దీనిపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఆయన ఆశ్చర్యకరంగా... చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రత ఇస్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఉన్నదే ఇద్దరు కానిస్టేబుళ్లు, అది ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ఏంటి? అని తెలుగుదేశం నేతలు డీజీపీ వ్యాఖ్యలపై విస్తుపోయారు. ఆయన మాత్రం ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు భద్రత తగ్గించారన్న ఆరోపణలు నిజం కాదన్నారు. శాంతిభద్రతల విషయంలో తాము కచ్చితంగా ఉన్నామని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల తొలగింపు పై పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రెస్ మీట్లో డీజీపీ సామాన్యులకు కూడా షాకిచ్చారు. సోషల్ మీడియాలో శృతిమించే రాజకీయ విమర్శలపై దృష్టి సారిస్తామని అందరికీ హెచ్చరిక జారీ చేశారు. వ్యక్తిగత గొడవలకు రాజకీయ ముద్ర వేయడం సరికాదన్నారు. అంటే... ఇక నుంచి వైసీపీని, జగన్ ను విమర్శిస్తే కేసులే అన్న అర్థం వచ్చేలా డీజీపీ మాట్లాడారు. మరి దీనిపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.