ఏపీ సర్కారు కేసులను దాచిపెడుతోందా? 

June 03, 2020

ఏపీ ప్రభుత్వం దేశంలోనే కరోనాను అతి తక్కువగా అంచనా వేసిన రాష్ట్రం. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, మంత్రులు, స్పీకర్ ఇలా ఒకరేమిటి... వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. పైగా ఎన్నికల కమిషనర్ ముందు జాగ్రత్తగా ఎన్నికలను వాయిదా వేస్తే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే విషయం కూడా మరిచిపోయి బూతులు తిట్టారు. బెదిరించారు. చివరకు ఆయన కేంద్రానికి లేఖ రాసి ప్రత్యేక భద్రత ఏర్పాటుచేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.

ఇదిలా ఉంటే... ఏపీ పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తోంది. కేసులను దాచిపెడుతుందేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తంచేశారు. తీవ్రత చాలా ఎక్కువగా ఉందని... ఏపీలో ఒక్క వారంలో కేసుల సంఖ్య వెయ్యి శాతం పెరిగింది. ఇదిచాలా ప్రమాదకరమైన సూచిక అని ప్రభుత్వాన్ని చంద్రబాబు హెచ్చరించారు. 

ఇక కేసుల నిర్దారణ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం చాలా స్లోగా ఉందని... ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ లో చాలా తక్కువగా పరీక్షలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టెస్టులు చేస్తున్న వాటిలో ఎక్కువ శాతంలో కేసులు వస్తున్నాయి. ఇది అర్థం చేసుకుని అయినా టెస్టులు వేగంగా చేయాలని.. కరోనా ఎక్కువ మందికి వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు వాస్తవాలు చెప్పి వారిని మరింత సమాయత్తం చేయాలన్నారు.

ప్రజలకు కూడా చంద్రబాబు మరిన్ని సూచనలు చేశారు. ప్రభుత్వాల మాట వినాలని... భౌతిక దూరం పాటించాలని.. మత, రాజకీయపరమైన సదస్సులు, వివాహ వేడుకలు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు.   వీలైనంతగా పరిసరాల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా వ్యాప్తిని ప్రజలు తమ వంతుగా అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు పేదలకు 5 వేలు ఇచ్చి ఆదుకోమని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు జీతాలు కోయడం తప్పు అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. చంద్రబాబు ప్రెస్ మీట్ అనంతరం... జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. టెస్టు కిట్లు ఎన్ని వీలయితే అన్ని రాష్ట్రానికి తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అనుభవజ్జుల మాటలు వినడానికి జగన్ ఇగో చూపితే ఏపీ ప్రజలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.