చంద్రబాబు సంచలన నిర్ణయం.. మోదీనే టార్గెట్

July 13, 2020

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత మరింత స్పీడు పెంచేశారు. ఏపీలో ఓటింగ్ ముగిసిన మర్నాడే ఢిల్లీకి చేరిపోయారు. శనివారం ఢిల్లీలో టీడీపీ నేతలతో కలిసి ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రతో కూడిన పూర్తి స్థాయి కమిషన్‌తో భేటీ అయ్యారు. 18 పేజీల వినతి పత్రాన్ని కమిషన్‌కు అందించారు. రెండు రోజులుగా ఈవీఎంలపై రాజీలేని పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉద్యమాన్ని అపరాదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టులో దీనిపై పోరాడుతున్న చంద్రబాబు ఇకపై మరింత ఉధృతం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే ఆదివారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరును గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు.

ఇదిలాఉండగా, ఎన్నికల ఫలితాలకు నలభై రోజుల సమయం ఉండడంతో చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ కాలంలో విశ్రాంతి తీసుకోకుండా భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టాలని వ్యూహాలు రచిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయేను అధికారంలోకి రానీయకూడదని పట్టుదలతో ఉన్నారని తెలిసింది. ఇందుకోసం వీలైనన్ని ఎక్కువ రోజులు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే పలుమార్లు ఢిల్లీలో పర్యటించి బీజేపీయేతర పక్షాలను కూటమిగా ఏర్పరచి మోదీని ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఇకపై కూడా అదే విధానంతో దూసుకుపోవాలని ఆయన అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

గతంలో బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చినట్లే ఇప్పుడు కూడా అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని అందుకు తగ్గట్లు ఎన్నికలు లేని రాష్ట్రాలకు చెందిన నేతలను అలెర్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిపక్షాలకు ధీటుగా వ్యూహాలు సిద్ధం చేసే అవకాశం ఉండడంతో.. చంద్రబాబు మరింత స్పీడు పెంచనున్నారని సమాచారం. సోమవారం కర్నాటకలోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించిన అనంతరం మరోసారి ఢిల్లీకి వెళ్లి కీలక నేతలతో భేటీ అవబోతున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ నలభై రోజుల్లో అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపైనా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో మోదీని ఓడించడంతో పాటు బీజేపీయేతర కూటమిని అధికారంలోకి తీసుకు రావాలని ఆయన పట్టుదలతో ఉన్నారట.