ఏపీ సర్కారు అమానవీయతను కడిగిపారేసిన బాబు

August 07, 2020

టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అర్ధరాత్రిపూట అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నాయుడును దాదాపు 100 మంది పోలీసుల సమక్షంలో అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

కనీసం ట్యాబ్లెట్లు వేసుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని...దౌర్జన్యంగా అచ్చెన్నను అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన పార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్ పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. అచ్చెన్న అరెస్టు సీఎం జగన్ శాడిజానికి పరాకాష్ఠని చంద్రబాబు మండిపడ్డారు.

బలహీన వర్గాలను అణచి వేయడమే లక్ష్యంగా జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, జగన్ ప్రోద్బలంతోనే ఏసీబీ దాడులు జరిగాయని ఆరోపించారు. చట్ట విరుద్ధంగా అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారని, అచ్చెన్నకు ఏదైనా హాని జరిగితే, ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. కక్షపూరితంగా అచ్చెన్నను అరెస్టు చేశారని, లాక్ డౌన్ సమయంలో వందలాది మంది పోలీసులతో ఈ తరహాలో అరెస్ట్ కు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

గత 38 సంవత్సరాలుగా అచ్చెన్న తనకు తెలుసునని, వారిది మచ్చలేని కుటుంబమని చంద్రబాబు అన్నారు. కొద్ది రోజుల క్రితమే అచ్చెన్న సర్జరీ చేయించుకొని ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారని, పేషెంట్ అని కూడా చూడకుండా అర్దరాత్రి అరెస్టు చేయడం దారుణమన్నారు. అసలు అది అరెస్టు కాదని...కిడ్నాప్ అని...ఇలా చేయడం నీచమైన చర్య అని మండిపడ్డారు. 

చట్టవిరుద్దంగా అచ్చెన్నాయుడిని చేసి కట్టుకథలు చెబుతున్నారని,జగన్ అవినీతిని అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు ఎండగట్టినందుకే అచ్చెన్నపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 16 నుంచి జరగబోతోన్న అసెంబ్లీ సమావేశాలలో అచ్చెన్న వేయబోయే ప్రశ్నలకు సమాధానాలు దొరక్కే ఆయనను అరెస్టు చేశారని మండిపడ్డారు. 

అచ్చెన్నాయుడి గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాననని, తుగ్లక్ పాలనలో జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షసానందం పొందారని అన్నారు.

రూ.లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమేనని ట్వీట్ చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని, ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ అనుకుంటున్నారుని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకి రక్షణగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గారు గుర్తెరిగితే మంచిదిదని లోకేశ్ ట్వీట్ చేశారు.

కాగా, అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో చంద్రబాబు, లోకేశ్ మాట్లాడారు. కనీస సమాచారం ఇవ్వకుండా కిడ్నాప్ తరహాలో అచ్చెన్నాయుడుని అదుపులోకి తీసుకున్నారని అచ్చెన్న కుటుంబ సభ్యులు విలపించారు. తమతో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు. అచ్చెన్న కుటుంబ సభ్యులకు చంద్రబాబు, లోకేశ్ ధైర్యం చెప్పారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని, ప్రెస్ మీట్ లో అధికారుల మొహంలో టెన్షన్, మాటల్లో తడబాటు చూస్తే అది అర్థమవుతోందని అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌తో మరోసారి రాజ్యాంగాన్ని జగన్ ఖూనీ చేశారని లోకేశ్ మండిపడ్డారు. 

బాబాయ్ అరెస్టు దుర్మార్గం - ఆదిరెడ్డి భవానీ

అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గమని రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెఢ్డి భవానీ మండిపడ్డారు. సీఎం జగన్  కక్ష సాధింపుతో బలమైన బీసీ నేతను అక్రమంగా అరెస్టు చేయించారని  అచ్చెన్నాయుడు సోదరుడైన దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడును ఎదుర్కొనలేకే అరెస్టు చేశారని భవానీ ఆరోపించారు.

గత 35 ఏళ్లుగా తమ కుటుంబం  ప్రజాసేవకే అంకితమైందని, ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని అన్నారు. సర్జరీ చేయించుకున్న అచ్చెన్నాయుడిని ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలతో పాటు జగన్ ప్రభుత్వం అవినీతి, అరెస్టులు, అక్రమాలపై నిలదీస్తామని అన్నారు.