చంద్రబాబు మరో గోల్ వేశాడు

July 05, 2020

ఇదేంటి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఒక పార్టీకి రానన్ని సీట్లు జగన్ కి వచ్చేశాయి. ఇక తెలుగుదేశాన్ని బతకనిస్తాడా అని కొందరు అనుమానాలు వ్యక్తంచేసిన మాట నిజమే. అయితే, అనతి కాలంలో తెలుగుదేశాన్ని బతకనీయడం పక్కన పెడితే... జగన్ తన పాలనతో తన చాప కిందకే నీరు తెచ్చుకుంటున్న పరిస్థితి. మిగతా వాటి సంగతి పక్కన పెడితే... సరిగ్గా ఎన్నికల ముందు ఉపకార వేతనాల విషయంలో మోహన్ బాబును ఉసిగొల్పి చంద్రబాబును రాక్షసుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు జగన్. రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఆనాడు క్రమం తప్పకుండా ఫీజు రీఎంబర్స్ మెంట్ ఆ ప్రభుత్వం చెల్లించినా... చివర్లో కొన్ని కారణాల వల్ల కొన్ని కాలేజీలకు ఉపకార వేతనాలు రాలేదు. అందులో మోహన్ బాబు విద్యా సంస్థలు కూడా ఉండటంతో ఎన్నికల్లో దాన్ని చాకచక్యంగా వాడుకున్నారు జగన్. కట్ చేస్తే... ఇపుడు ఆ ధర్నాయే జగన్ మెడకు చుట్టుకుంటోంది.
పిల్లల ఫీజులకు పరిమితి లేదు. ఎంత చదువుకుంటే అంత చదువుకోవచ్చు. ఎంత ఫీజు అయినా కడతాం అని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. పూర్తి ఫీజు చెల్లిస్తాం అని చెప్పారు. పూర్తి పీజు చెల్లించడం పక్కన పెడితే... గత ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కూడా జగన్ ప్రభుత్వం చెల్లించకుండా ఆపేసింది. దీంతో కాలేజీల నిర్వహణ భారమై, విద్యార్థులను గాలికొదిలేశారు. దీంతో ముఖ్యమంత్రి గారీ మా చదువులకు భరోసా ఏదీ అంటూ రోడ్లు ఎక్కారు. స్కూలు, కాలేజీ పిల్లలందరూ రోడ్ల మీదకు వచ్చి ధర్నాచేశారు. వారు తమ ప్రాథమిక హక్కు కోసం పోరాడుతుంటే... ప్రభుత్వం పోలీసు పాదంతో వారిని అణచివేసింది. చిన్నపిల్లలు అని చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్లలో కుక్కింది. కొందరు భయపడి ఏడుస్తున్నా పట్టించుకోలేదు. అత్యంత దారుణంగా విద్యార్థులను అణచివేసింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజాగా తీవ్రంగా స్పందించారు.
నోటికొచ్చిన హామీలను ఇచ్చేసి అధికారంలోకి వచ్చాక తప్పించుకు తిరిగితే కుదరదు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. స్వేఛ్ఛగా చదువుకోవాల్సిన విద్యార్థులు తమ ఫీజుల కోసం, ఉపకారవేతనాల కోసం ధర్నాలకు, బంద్ లకు దిగడం ప్రభుత్వ వైఫల్యానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఈ పాలకులు తమ భవిష్యత్తు బాగుకోసం చూసుకుంటున్నారే తప్ప, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. అంటూ.... ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వ కర్కశత్వాన్ని ప్రశ్నిస్తూ వెంటనే వారి ఫీజులు విడుదల చేసి చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు కక్షసాధింపు చర్యల కారణంగా ఏపీ అంటే వ్యాపారులు, పెట్టబడిదారులు భయపడుతున్నారు. ఉన్న పథకాలు, ప్రస్తుత పాలసీలు కొత్తవి రూపొందించకుండా తొలగించడంతో వ్యాపారాలు స్తంభించి పన్నుల ఆదాయం పడిపోయింది. దీంతో ఏపీలో రచ్చ రచ్చ అవుతోంది. ఖజానా వట్టిపోయింది. జనం ఊరుకోవడం లేదు. హామీలు భారమై కూర్చున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితిల్లో ఏపీ ఆకాశం వైపు చూస్తోంది. ప్రభుత్వ అవగాహనా రాహిత్యాన్ని, అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని చంద్రబాబు ఎండగడుతున్నారు. ఇప్పటికే అనేక అంశాలతో జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన చంద్రబాబు... తాజాగా విద్యార్థుల విషయంలో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.