ఖరగ్ పూర్ లో అదరగొట్టిన బాబు

July 10, 2020

ఢిల్లీ నుంచి బెంగాల్ వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు మమత బెనర్జీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ తరఫున పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ తెలుగు వాళ్లు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. అందుకే చంద్రబాబు ఇక్కడ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇక్కడ తెలుగు వారు ఇంత పెద్ద సంఖ్యలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో తెలుగు వారి పాత్ర చాలా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగు వారు ఈ స్థాయిలో బెంగాల్ అభివృద్ధికి పాటుపడటం గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మమతా బెనర్జీకి పెద్ద బిరుదే ఇచ్చారు.
మమతా బెనర్జీ రాయల్ బెంగాల్ టైగర్. ఆమె ముందు వంద మంది మోడీలు కూడా పనికి రారు. బెంగాల్ అభివృద్ధిలో మమత పాత్ర అసామాన్యమైనది. కొత్త తరానికి ఆమె సరైన నాయకత్వం వహిస్తోంది. దేశంలో కనీవినీ ఎరుగుని మెజారిటీతో ఆమెను గెలిపించాలి. తెలుగు వారు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. 42 స్థానాల్లోనూ టీఎంసీ జెండా రెపరెపలాడాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
బాబు ప్రసంగం తెలుగులోనే కొనసాగడం ఇక్కడి ప్రత్యేకత.