గుంటూరు ఆస్పత్రి వద్ద చంద్రబాబు... భారీగా జనం

August 13, 2020

పార్టీ ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడరు అయిన అచ్చెన్నాయుడిని పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాదు నుంచి హుటాహుటిన గుంటూరు బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే... అంతకుమునుపే అచ్చెన్నాయుడిని కలవడానికి చంద్రబాబు అనుమతి కోరగా నిరాకరించారు. అయినా చంద్రబాబు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

ప్రస్తుతం అచ్చెన్నాయుడు అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రబాబు ఆస్పత్రి సూపరింటెండెంట్ ను బయటకు పిలిపించి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. చంద్రబాబు రాకతో అక్కడికి పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు చేరుకున్నాయి. అసలే కోవిడ్ వాతావరణంలో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది.

మీరు ఎన్ని పనికిరాని పదాలు వాడినా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతోనే మిమ్మల్ని ఎదుర్కొంటుంది. ఇష్టారాజ్యంగా చట్టాన్ని అతిక్రమించి అక్రమంగా వ్యవహరిస్తే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అంటూ చంద్రబాబు వైసీపీ నేతలను హెచ్చరించారు. నేతలను అక్రమంగా అరెస్టు చేసి భయపెట్టాలనుకుంటున్నారేమో... కలలు కనడం మానేయండని చంద్రబాబు హెచ్చరించారు. 

 

ఇదిలా ఉండగా.. శుక్రవారం రాత్రి స్పెషల్ కోర్టు వద్ద అచ్చెన్నాయుడిని కలవడానికి వెళ్లిన లోకేష్ ను కూడా పోలీసులు అనుమతించలేదు. పోలీసులతో కాసేపు వాగ్వాదం జరిగింది. కలవడానికి అనుమతి లేదని నిరాకరించారు. ఇదిలా ఉండగా... ఆదివారం ఉదయం లోకేష్ అనంతపురం వెళ్లనున్నారు. అక్కడ జేసీ కుటుంబాన్ని కలవనున్నారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీ దృష్టిని కోర్టుల నుంచి, ఇతర వివాదాల నుంచి మళ్లించేందుకు జగన్ ఇలాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు.

జగన్ ది రాక్షసానందం - లోకేష్

అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి అరెస్టులను నిరసిస్తూ... లోకేష్ ట్విట్టరు వేదికగా వైకాపా ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

’’బీసీ నేత అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్ట్ ని పక్కదారి పట్టించేందుకే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి లను అరెస్ట్ చేసారు. 16 నెలల జైలు పక్షి, లక్ష కోట్ల దోపిడీదారు, 11 కేసుల్లో ఏ1 జగన్ రెడ్డి, టిడిపి నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నాడు ఏడాది పాలనలో  జగన్  ఒక చేతగాని ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైంది. ఆయనను అభద్రతా భావం వెంటాడుతోంది.

అందుకే రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి తెరలేపారు. ప్రలోభాలకు లొంగితే వైకాపా కండువా. లొంగకపోతే జైలు. ప్రతిపక్ష నేతల పై వేధింపులు, కక్ష తీర్చుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి అయినట్టు ఉంది. సమర్థవంతంగా జగన్ గవర్నమెంట్  'టెర్రరిజాన్ని' ఎదుర్కొంటాం.జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి ల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను’’