చంద్రబాబు, జగన్‌... ప్రకృతి చెప్పిన సత్యం ఏమిటి?

May 26, 2020

రెండు పెను తుపాన్లు, ఒక వరద.. చంద్రబాబు, జగన్

అయిదేళ్ల కిందట... విభజనతో రాజధాని లేని రాష్ట్రానికి సీఎం అయ్యారాయన. ఒక్కటొక్కటికీ అన్నీ చక్కదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉండగానే హుద్‌హుద్ తుపాను తరుముకొచ్చింది. మునుపెన్నడూ చూడనంత వేగంతో వీచిన పెనుగాలులు ఉత్తరాంధ్రను ధ్వంసం చేశాయి. కొత్త రాష్ట్రంలోని ప్రధాన నగరం విశాఖ పూర్తిగా ధ్వంసమైంది. తాగడానికి నీరు లేదు.. ఒక్క విద్యుత్ స్తంభమూ మిగల్లేదు.. చెట్లు కూకటివేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి...సెల్ టవర్లు కుప్పకూలిపోయి ఫోన్లేవీ పనిచేయలేదు. అలాంటి సమయంలో కొత్త రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు విశాఖపట్నంలోనే మకాం వేసి వారం రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దారు. అన్ని వ్యవస్థలనూ పునరుద్ధరించారు. ఏడాదిలో విశాఖకు అంతకుముందున్న స్థాయిలో పచ్చదనం వచ్చేలా చేశారు.
రాష్ట్రం మెల్లగా కుదురుకుంటూ ఒక్కో ప్రాజెక్టు పనులూ సాగుతున్న సమయంలో మరో కుదుపు. ఈసారి తిత్లీ తుపాను. మళ్లీ ఉత్తరాంధ్రపై నిప్పులు కక్కుకుంటూ వచ్చిపడింది. ఈసారి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికింది. అప్పటికి ఆ పక్కనే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేసుకుంటున్న అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి తుపాను దెబ్బకు తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. అప్పటికి ఉత్తరాంధ్రలోనే తెగ తిరుగుతున్న మరో నాయకుడు పవన్ కల్యాణ్ కూడా పత్తా లేకుండా పోయారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి అధికారులు, ఆరేడుగురు మంత్రులు అందరినీ వెంటబెట్టుకుని గంటల్లోనే శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. పలాస పట్టణాన్ని పాలన కేంద్రంగా మార్చుకుని అక్కడే ఉంటూ పరిస్థితిని చక్కదిద్దారు.
ఈ రెండు తుపాన్లతో చంద్రబాబు పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. తుపానులను ఎదుర్కోవడంలో నంబర్ 1గా పేరున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్‌తో సమానంగా చంద్రబాబుకూ విపత్తులను డీల్ చేయడంలో పేరొచ్చింది.
మళ్లీ ఎన్నికలొచ్చాయి... ఈసారి జనం జగన్‌ను ఆదరించారు. ఆయన సీఎం అయ్యారు. సీఎం అయిన రెణ్నెళ్లకే గోదావరికి వరదలొచ్చాయి. గత పదిహేను రోజులుగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాల ప్రజలు నీళ్లలోనే ఉన్నారు. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కృష్ణానదికీ వరదొచ్చింది. లంక గ్రామాలు నీట మునిగాయి. రాజధాని పక్కనే ఉన్న విజయవాడ నగరమూ జలమయమైంది. విజయవాడను ఆనుకునే ఉన్న ప్రకాశం బ్యారేజ్ కట్టలు తెగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అది ఎంత పెద్ద విలయంగా మారుతుందో తెలియదు.
ఇలాంటి విపత్కర సమయంలో సీఎం జగన్మోహనరెడ్డి కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. తొలిసారి మంత్రయిన జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పక్కన సీనియర్ మంత్రులు లేకుండా ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు. అధికారులిచ్చిన కాగితాల్లోని లెక్కలు చెబుతున్నారు.. చంద్రబాబు, టీడీపీ నాయకులపై విమర్శలు కురిపిస్తున్నారే కానీ నీట మునిగిపోతున్న ప్రజలను ఎలా గట్టెక్కించాలి.. ప్రకాశం బ్యారేజీకి ఏమైనా అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో ఆలోచన చేయడం లేదని విపక్షం ఆరోపిస్తోంది.
అంతేకాదు... చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలోనే కేరళలో వరదలొస్తే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఏపీలో జగన్ సీఎంగా ఉన్న సమయంలోనూ మళ్లీ కేరళలో వరదలొచ్చాయి. ఈసారీ అదే పరిస్థితి 125 మందికిపైగా చనిపోయారు. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ టీంలు కూడా లేకుండా తొలిసారి దెబ్బతిని.. రెండోసారి ఇప్పుడొచ్చిన వరదలనూ హ్యాండిల్ చేయలేక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్న కేరళ ప్రభుత్వంతో ప్రస్తుత ఏపీ ప్రభుత్వాన్ని పోలుస్తున్నారు విమర్శకులు. మొత్తానికి ప్రకృతి వైపరీత్యాలు ఇద్దరు సీఎంలు చంద్రబాబు, జగన్‌ల మధ్య తేడాను ప్రజలకు తెలిసేలా చేశాయంటున్నారు.