జగన్ కౌంటర్ - బాబు ఎన్ కౌంటర్

July 04, 2020

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై ఈరోజు ప్రధాన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వద్దు.. హోదానే కావాలని తీర్మానం చేస్తున్నామని జగన్ ప్రకటించారు. 59 శాతం జనాభాను, అప్పులను వారసత్వంగా మనకు దక్కాయని జగన్ అన్నారు. కానీ తెలంగాణను పొరపాటున కూడా ఒక్క మాట అనలేదు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన విషయాన్ని సభలో ప్రస్తావించని జగన్ ఆదాయాన్ని, ఉద్యోగాన్ని ఇచ్చే హైదరాబాద్ కూడా ఏపీకి లేకుండా పోయిందన్నారు. మరి ఏపీకి అలాంటి అన్యాయం జరగడానికి కారణమైన కేసీఆర్ చేసిన అకృత్యాలను, పోలవరంలో అడ్డుపడుతున్న తీరును ఇంకా ఇతర విషయాలను జగన్ మాట్లాడలేదు.

ఈ విషయంపై జగన్ చంద్రబాబు ఇద్దరి మధ్య చిన్న వాదన జరిగింది. మునుపటి ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటులో చెప్పారు. ప్రధాని చెప్పిన మాటను ఆమోదించి అమలు పరిచేది ఆర్థిక సంఘం. అపుడు 14వ ఆర్థిక సంఘం నడుస్తోంది. అది జనవరి 2015 వరకు ఉంది. అంటే మోడీ వచ్చాక కూడా ఏడు నెలల పాటు ఆర్థిక సంఘం ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో లేఖ రాయలేదు. అందుకే ప్రత్యేక హోదా రాలేదు. చంద్రబాబు లేఖ రాసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది అని జగన్ వ్యాఖ్యానించారు. భారతీయ రాజకీయాలు చూస్తూ కూడా జగన్ చెప్పిన విషయాన్ని అమాయకులు తప్ప ఎవరూ నమ్మరు. దీనిని అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్ ఉదారహణ చూద్దాం.
ఏపీ ముఖ్యమంత్రి మారిపోయాడు. కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు. టీటీడీ బోర్డు పాతదే ఉంది. మరి చంద్రబాబు పెట్టిన టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలు ఎవరైనా అధికారులు అమలు పరుస్తారా, అలా జరుగుతుందా? పోనీ బోర్డు కనీసం సమావేశం ఏర్పాటుచేయగలదా? నియమించింది ఎవరైనా... నాయకుల ఇష్టాఇష్టాలను బట్టి వ్యవస్థలు పనిచేస్తాయి. కేంద్రంలోనూ అంతే... మోడీ తలచుకుంటే ఒక్క నెలలో ప్రత్యేక హోదా వస్తుంది. చంద్రబాబు లేఖ రాసినా రాయకపోయినా దానికి అడ్డం కాదు. ఈ విషయం జగన్ కు కూడా తెలుసు. కానీ చంద్రబాబును డ్యామేజ్ చేసే అవకాశం టెక్నికల్ గా దొరికినపుడు జగన్ ఊరికే ఎందుకుంటాడు. అందుకే బాబు లేఖ రాయలేదు కాబట్టి ప్రత్యేక రాలేదని అయామకులను నమ్మించే ప్రయత్నం చేశారు.

దీనిపై స్పందించిన చంద్రబాబు... ఏపీ తీవ్రమైన లోటులో ఉంది. బాధ్యత కలిగిన నేతను కాబట్టి... కేంద్రం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయి పోగొట్టుకోకూడదని అని భావించాను. ప్రత్యేక హోదాతో సమానమైన ప్రయోజనాలు ప్యాకేజీ ద్వారా కల్పిస్తాం. ఆ పదం వాడం అంతే అంటే... ఇతర రాష్ట్రాల వల్ల ఇబ్బందులు తప్పించడానికి ఇలా చేస్తున్నారని ఒప్పుకున్నాం. అయినా ప్రత్యేక హోదాను మేమేమీ విస్మరించలేదు. ఏపీ ప్రయోజనాల కోసం 29 సార్లు ఢిల్లీకి వెళ్లిపోరాడాను. హోదాకు ఆర్థిక సంఘం కూడా ఒప్పుకోలేదు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా అధికార పార్టీ చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నాం. అన్ని విధాలుగా ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తాం అని చంద్రబాబు చెప్పారు.