​వైజాగ్ వెళ్లి తీరతా... ఇది తథ్యం - చంద్రబాబు శపథం

June 04, 2020

ఎలాంటి ప్రమాదకరమైన ర్యాలీ కాదు. ఏ గొడవలు లేవు. ప్రశాంతంగా ఉన్న నగరంలో పోలీసుల అనుమతితో చంద్రబాబు వైజాగ్ పర్యటన పెట్టుకున్నారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు ప్రైవేటు కార్యక్రమాలకు కూడా చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. అయితే... వైసీపీ వ్యూహాత్మక, అణచివేత రాజకీయానికి పోలీసుల బలగాల్ని వాడటంతో, పోలీసులు చేతులు కట్టేయడంతో వైజాగ్ వైసీపీ మూకల చేతిలోకి వెళ్లిపోయింది. అనుమతి ఉన్న ర్యాలీని అడ్డుకోవడానికి వేలాది వైసీపీ కార్యకర్తలు తరలివస్తే వారిని అడ్డుకోకుండా అనుమతి ఉన్న టీడీపీ ర్యాలీని ఆపేశారు పోలీసులు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

అయిష్టంగా, పోలీసులు బలవంతం మీద వైజాగ్ నుంచి చంద్రబాబు హైదరాబాదు వచ్చారు. అంతకుముందు పోలీసులతో ఎయిర్ పోర్టులో చంద్రబాబుతో వాగ్యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని హెచ్చరించారు. "రేపైనా రానిస్తారా? రానివ్వరా, రేపు రానివ్వకపోతే ఎల్లుండి వస్తా, అప్పటికీ రానివ్వకపోతే ఆ మరుసటి రోజు వస్తాను. విశాఖ రావడం ఖాయం.  ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. ప్రజాస్వామ్యబద్ధంగా వైజాగ్ పర్యటన చేసి తీరతాను’’ అని చంద్రబాబు శపథం చేశారు. 

పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు చెప్పే ప్రయత్నం చేయగా... ఇవి మీరు సృష్టించిన పరిస్థితులు. రౌడీమూకలు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే... అదుపు చేయలేని అసమర్థులు మీరు వచ్చి కారణం లేకుండా నన్ను ఆపుతారా? మీ చేతకానపుడు అనుమతి ఎందుకు ఇచ్చారు?' అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. 

ఉత్తరాంధ్ర పర్యటనను ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని  చంద్రబాబు భీష్మించారు. రాజకీయ కార్యక్రమాలు మా హక్కు. వాటిని మీరు అడ్డుకోలేరు అంటూ చంద్రబాబు వారిని హెచ్చరించారు.