చెడుగుడు ఆడుకున్న బాబు

February 26, 2020

కియా గొడవ... ఈరోజు వైసీపీకి జ్వరం తెప్పించింది. పోనీ చంద్రబాబును బ్లేమ్ చేద్దామా అంటే వార్త రాసిందేమో అంతర్జాతీయ మీడియా. అందులో చంద్రబాబు బంధువులు పరిచయస్తులు కూడా ఎవరూ పనిచేయడం లేదు. చివరకు ఏం చేయలేక అవమానాలు తట్టుకోలేక ఎదురుదాడికి దిగడం ద్వారా ఈ అవమానాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు  వైసీపీ నేతలు. 

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికయ్యా వృద్ధి రేటు పడిపోవడం పక్కన పెడితే... రాష్ట్ర పన్నుల ఆదాయం దారుణంగా పడిపోయింది. ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రాజెక్టులు కట్టడం లేదు. ప్రతినెలా జీతాలకు డబ్బులు వెతుక్కోవడంతోనే సరిపోతుంది ముఖ్యమంత్రికి. అయితే.. దీనికి కారణం మరెవరో కాదు. ఆ పార్టీయే. జగన్ గాని, ఆ పార్టీ నేతలు గాని పెట్టుబడులు పెట్టేవాళ్లకు వ్యాపారాలు చేసుకుంటారు కదా మేమెందుకు రాయితీలు ఇవ్వాలి అని అజ్జానంతో అడుగుతున్నారు. అందుకే మేమెందుకు మీ వద్దకు రావాలి అని వచ్చేవాళ్లు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు నడిచిన సీను ఇది.

మొన్నామధ్యన రావాలనుకున్న కంపెనీలు తరలిపోవడం చూశాం గాని వైసీపీ దెబ్బకు బ్రహ్మాండంగా నడుస్తున్న కంపెనీలు తమ వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తే ప్రశాంతంగా ఉంటుంది అనుకునే దుస్థితికి వెళ్లింది ఏపీలో పాలన. కియా తరలింపు వార్త నేపథ్యంలో ఈరోజు అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువుపోయిన నేపథ్యంలో... జగన్ పాలన గురించి చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. అసలు వీళ్లు రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకెళ్తారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. 

తాము కియాను ఆహ్వానించి భూమి చూపిస్తే... జగన్ అనంతపురం వెళ్లి అక్కడి రైతులను భూములు ఇవ్వొద్దని చెప్పాడు. అయినా వాళ్లు జగన్ మాట నమ్మకుండా మా ప్రభుత్వాన్ని నమ్మి ఆనాడు భూములు ఇచ్చారు. అక్కడి రైతులు విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టే పిల్లల భవిష్యత్తు అక్కడ బాగుపడిందిపుడు. చివరకు  కియా ప్లాంట్ ఏర్పాటు తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ కంపెనీ సీఈవోను వేలెత్తి చూపి తిట్టారు. అవమానించారు. ఇలా చేస్తే ఎవరైనా వస్తారా? అంటూ బాబు ప్రశ్నించారు. "ఇక్కడి భూములు మావి, ఇక్కడి నీళ్లు మావి, ఉద్యోగాలు కూడా మాకే ఇవ్వాలని ఓ అంతర్జాతీయ సంస్థను బెదిరించారు. వీళ్ల ఊరికి వచ్చి సంపద పెంచితే.. వారికంటే వీరికే ఎక్కువ లాభం. ఆ ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు పలు క్లిప్పింగులు వేసి చూపించారు. గోరంట్ల వీడియోతో పాటు మరో నాయకుడు, తమ లారీలనే అద్దెకు తీసుకోవాలని డిమాండ్ చేసిన క్లిప్పింగు కూడా వేశాడు. మీరు లక్షలకు లక్షలు సంపాదిస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా? అని అందులో బెదిరించారు. ఇలాంటి పలు విషయాలపై చంద్రబాబు సాక్ష్యాలతో సహా వైసీపీ ప్రభుత్వాన్ని ఉతికారేశారు.