చంద్రబాబు వద్ద కీలక రిపోర్టులు.. టీడీపీ గెలుపుపై ధీమా

May 27, 2020

గత ఎన్నికల ఫలితాలను మరోసారి రిపీట్ చేయాలని భావిస్తోంది అధికార తెలుగుదేశం పార్టీ. అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలకు కొంత విరామం ప్రకటించిన ఆయన.. అభ్యర్థుల ఎంపికపైనే 20 రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో ఆశావాహులతో నేరుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు, అసంతృప్తిగా ఉన్న నేతలకు అభయం ఇచ్చి వారిని బుజ్జగిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఎన్నికల హడావిడి బాగా కనిపిస్తోంది. మరోవైపు, ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సిద్ధం అవుతుండడంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని ప్రారంభించాలని చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే షెడ్యూల్‌ వెలువడే నాటికి టీడీపీ మెజారిటీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు తన అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశారు.

మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 115 స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకుగాను 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, కొన్ని అభ్యంతరాలు, మరికొన్ని సూచనలు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ప్రకటన కొంత ఆలస్యమైంది. ఇప్పడు అన్ని లాంఛనాలను పూర్తి చేసుకుని గురువారం రాత్రి 11 గంటలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. మొత్తం స్థానాల్లో 126 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. అయితే, మిగిలిన 49 మందితో పాటు 25 మంది ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించాల్సి ఉంది. మిగిలిన సీట్లలో కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడానికి ఆ పార్టీ నాయకత్వం వేగంగా పని చేస్తోంది. తగినంత ముందుగానే అభ్యర్థుల ఎంపిక, కసరత్తును పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టడం పార్టీకి ఉపకరించబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉండగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య బాగా ధీమాగా కనిపిస్తున్నారు. విజయం తమదేననే కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. అసలు చంద్రబాబు ఎందుకిలా ఉన్నారు..? ఏఏ అంశాలను ఆధారంగా చేసుకుని ఆయన కంగారు పడడంలేదు..? అనే విషయాలపై క్రమంగా క్లారిటీ వస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని ఆయన బాగా నమ్ముతున్నారట. రాష్ట్రం మొత్తం మీద కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది ఈ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నారని, వారిలో సగం మంది ఓటు వేసినా ప్లస్ అవుతుందని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది. అలాగే లబ్ధిదారులతో టీడీపీ నేతలు నిరంతరం టచ్‌లో ఉండడం.. ప్రభుత్వ పథకాల వల్ల వాళ్లు ఏ విధంగా లబ్ధి పొందారో వివరించడం వంటి వాటి వల్ల టీడీపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందని టీడీపీ అధినేతకు రిపోర్టులు వచ్చాయని సమాచారం. అందుకే ఆయన విజయం తమదేనని అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.