మహిళల్లో ఈ చైతన్యానికి కారణం చంద్రబాబే..

July 15, 2019

భారీ ఉంత్కంఠ, గొడవలు, విధ్వంసాల నడుమ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో చూపిన మక్కువ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్నో ఇబ్బందులకోర్చి.. ఒక్క తాటిపైకి వచ్చి వారు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మహిళలంతా ఇలా ఏకమై ఓటేయడానికి కారణం.. వారి పట్ల చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పోలింగ్ కేంద్రాల్లో తెల్లవార్లు వేచి ఉండి మరీ మహిళలు ఓటేశారు. ఇది ఒక చరిత్ర. ఒక రికార్డు. ఇదే చరిత్ర అనుకుంటే.. కుప్పంలో చంద్రబాబుకు వెల్లువెత్తిన మహిళా మద్దతు మరో చరిత్ర. కుప్పం నియోజకవర్గంలో ఏనాడూ ఏ రంగంలోనూ మహిళలు పురుషులకంటే ఏమాత్రం తగ్గలేదు. ఒకనాడు కూలి చేసుకున్నా, నేడు ఓటింగుకు తండోపతండాలుగా తరలివచ్చినా, కొంగు బిగించి మరీ మగవారితో పోటీ పడ్డారు. ఆకాశంలోనే కాదు.. ఓటింగులోనూ తాము సగమేనని నిరూపించుకున్నారు. ఇంట్లోని మగాళ్లను కాదని, తామెవరికి ఓటేయాలో ముందుగానే సమా వేశాలు ఏర్పాటు చేసుకుని మరీ తీర్మానించుకున్నారు. అదే తీరులో పోలింగు బూత్‌లకు తరలివచ్చి తామకున్నవారికే ఓటేసి ధీరత్వాన్ని ప్రదర్శించారు. కుప్పం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయానికి 2,13,146 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,82,087 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య 1,05,539 కాగా, వారిలో 89,980 మంది బూత్‌లకు వచ్చి మరీ ఓటేశారు. మొత్తం పురుష ఓటర్లు 1,07,587 మంది కాగా, వీరిలో 92,104 మంది మాత్రం ఓటు వేశారు. అంటే పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా మహిళా లోకం పోలింగ్ కేంద్రాలకు కదిలింది.

ఇక శాంతిపురం మండలంలో పరిస్థితి మరోలా ఉంది. అదో మారుమూలనున్న చిన్న గ్రామ పంచాయతీ. అక్కడ వెలుగు గ్రూపు సభ్యులందరూ పోలింగుకు సుమారు నాలుగైదు రోజుల ముందుగానే రహస్యంగా సమావేశమయ్యారు. వారిలో వారు చర్చోపచర్చలు జరిపారు. భర్తలు, యుక్తవయసుకొచ్చిన కొడుకులు విపక్షానికి ఓటెయ్యమంటున్నారని వేధిస్తున్నట్లు కొంతమంది మహిళలు అందరి దృష్టికి తీసుకొచ్చారు. మీకు వెయ్యడం ఇష్టమేనా అని నాయక మహిళలు వారినడిగారు. తమకు ‘పసుపు-కుంకుమ’లు ఇచ్చి కుటుంబాలను తీర్చిదిద్దిన చంద్రన్నకు ఓటేయాలని ఉన్నా, వేయలేకపోతామన్న ఆవేదన ఉందని, అయినా ఇంట్లోని మగాళ్లను కాదని ఆయనకు వేసే పరిస్థితి లేదని సదరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగు బూత్‌కెళ్లి ఎవరికి ఓటేశామో, మనం చెప్తే తప్ప ఎవరికీ తెలియదని, అటువంటపుడు ఇంట్లోని మగాళ్లకు మాత్రం ఏం తెలుస్తుందని నాయక మహిళలు ధైర్యం చెప్పారు. మగాళ్లతో చెప్పకుండా పంచాయతీలోని ‘వెలుగు’ మహిళలందరూ సైకిల్‌పైనే ఓటేసి చంద్రన్నకు భారీ మెజారిటీ తెప్పించాలని రహస్య తీర్మానం చేశారు. జిల్లాలోనే అతి మారుమూల వెనుకబడిన ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలోని మహిళల్లో పెరిగిన రాజకీయ చైతన్యానికి ఇదో ఉదాహరణ మాత్రమే.

మొత్తంగా చూస్తే.. అధికార తెలుగుదేశం పార్టీయే వారిలో వచ్చిన ఈ చైతన్యానికి కారణమని చెప్పక తప్పదు. టీడీపీ అధినేత మహిళా సంక్షేమానికి పెద్ద పీత వేయడం ఈ చైతన్యానికి ముఖ్య కారణం. ఇదే విషయాన్ని రాజకీయ విశేషకులు సైతం చెబుతున్నారు.