బాబుకు అంతా శుభ‌మే.. ఎల్వీ మాటే సాక్ష్యం!

May 25, 2020

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం... మొన్నిటిదాకా ఉప్పూ నిప్పులానే క‌దిలారు. అయితే ఏమైందో తెలియదు గానీ... సోమ‌వారం ఉన్న‌ట్లుండి ఎల్వీ నేరుగా చంద్ర‌బాబు క్యాంపు కార్యాల‌యానికి వెళ్లారు. అర‌గంట పాటు భేటీ అయ్యారు. ఆ వెంట‌నే ఏపి కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి వ‌చ్చేసింది. ఇక మంగ‌ళ‌వారం నాటి విష‌యానికి వ‌స్తే... స‌చివాల‌యంలోని కేబినెట్ భేటీ జ‌రిగే కాన్ఫ‌రెన్స్ హాల్‌. ముందుగా సీఎస్ హోదాలో ఎల్వీనే వచ్చారు.

అప్ప‌టికే భేటీకి వ‌చ్చిన మంత్రులంతా హాల్ లో వ‌రుస‌గా కూర్చున్నారు. వారి వ‌ద్ద‌కు వెళ్లిన ఎల్వీ... ఒక్కొక్కరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు. ప్ర‌తిగా బాబు కేబినెట్ లోని మంత్రులు కూడా ఎల్వీతో చేతులు క‌లిపారు. ఆ వెంట‌నే ముహూర్తం దాటిపోతోంద‌న్న మాట వినిపించినంత‌నే చంద్ర‌బాబు కూడా హాల్ లోకి వ‌చ్చారు. నేరుగా వ‌చ్చి త‌న సీట్లో కూర్చున్నారు. ఆ ప‌క్క‌నే త‌న‌కు కేటాయించిన సీట్లో ఎల్వీ కూడా కూర్చున్నారు. సీఎస్ హోదాలో మొద‌ట భేటీని ప్రారంభించాల్సిన ఎల్వీ... ఒక్క‌సారిగా గొంతు స‌వ‌రించుకుని మైక్ ఆన్ చేశారు.

చంద్ర‌బాబు నిర్వ‌హించిన కేబినెట్ భేటీల్లో ఇది 108వ‌ద‌ని చెప్పారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న ఈ సంఖ్య‌లోని అంకెల‌ను క‌లిపితే 9 వ‌స్తుంద‌ని చెప్పారు. ఇది చంద్ర‌బాబుకు శుభ‌సూచ‌క‌మేన‌ని కూడా ఆయ‌న చెప్పారు. అంటే... బాబుకు ఇక అన్నీ శుభ‌సూచ‌కాలేన‌ని ఎల్వీ చెప్పార‌న్న మాట‌. అదేంటీ... చంద్ర‌బాబుకు వైరివ‌ర్గ‌మైన వైసీపీకి అనుకూల అధికారిగా ముద్ర‌ప‌డ్డ ఎల్వీ నోట... చంద్ర‌బాబుకు శుభ సూచక‌మ‌ని మాట వినిపించ‌డ‌మా? అంటే... కేబినెట్ భేటీ సాక్షిగా ఎల్వీ నోట నుంచి ఈ మాట వినబ‌డితే న‌మ్మ‌రా? న‌మ్మి తీరాల్సిందే. వైరి వ‌ర్గానికి అనుకూలుడిగా పేరు ప‌డ్డ ఎల్వీ నోట నుంచే చంద్ర‌బాబుకు శుభ‌సూచ‌కం వినిపిస్తే... ఇక రేప‌టి ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా ఆయ‌న‌కు అనుకూలంగా వ‌చ్చిన‌ట్టే క‌దా.