బిగ్ మిస్టేక్ : డిఫెన్స్ లో పడిన వైసీపీ

June 03, 2020

రాజ్యసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకుగాను ఏకంగా 151 సీట్లలో గెలిచి అద్భుత ప్రజాదరణ చూరగొన్న వైసీపీ.. అతికొద్ది నెలల్లోనే ఆ ప్రాభవాన్ని కోల్పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు వైసీపీ.. ముఖ్యంగా జగన్ వ్యవహారశైలి కారణమని అంటున్నారు. అసలు టీడీపీని ఓడించి తప్పుచేశామని ప్రజలు పశ్చాత్తాపపడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసే పనులు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి.

మరో పదిపదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో విపక్షాలు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారనే వాదనలు అన్ని పార్టీల నుండి వినిపిస్తున్నాయి. ఈ వాదనలకు బుధవారం నాటి దాడి సంఘటన బలాన్ని చేకూర్చింది. ఏకంగా టీడీపీ కీలక నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్నలపై దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతిపక్షంలోని పెద్ద నేతల పైనే వైసీపీ కేడర్ దాడి చేసిందంటే ఇక, గ్రామాలు, మండలాల్లో చిన్నస్థాయి నేతల పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది.
ఆరేడు నెలల్లోనే జగన్ ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర అప్రతిష్ట మూటగట్టుకుందని, ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీ ఆందోళన చెందుతోందని అంటున్నారు. ఈ కారణంగానే ప్రతిపక్ష నేతలు నామినేషన వేయకుండా అడ్డుకోవడం, అవసరమైతే దాడుల వరకు వెళ్తున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఈ దాడి వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేసిందని అంటున్నారు.
ఇప్పటి వరకు చిన్నస్థాయి వరకు జరిగిన ఘటనలు.. చిన్నవైనా, పెద్దవైనా పెద్దగా వెలుగులోకి రాలేదు. అప్పటికే వైసీపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఇద్దరు కీలక నేతలపై దాడి చేసి, కారు అద్దాలు పగులగొట్టి, కొందరికి గాయాలు అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఘటన వైసీపీని డిఫెన్స్‌లో పడేసింది.
వైసీపీ ఇరకాటంలో పడిన కారణంగానే నష్టాన్ని ఎంతోకొంత పూడ్చుకునేందుకు దాడికి కారణమైన వారిని అరెస్ట్ చేశారని అంటున్నారు. కనీసం తాము ఉపేక్షించలేదని చెప్పేందుకు మాత్రమే ఈ చర్య అని, కానీ చిత్తశుద్ధి మాత్రం ఉండకపోవచ్చునని అంటున్నారు. ఇప్పటికే ప్రజల ఆగ్రహం చూస్తున్న వైసీపీకి ఇప్పుడు ఎన్నికల ముందు జీర్ణించుకోలేని అంశమేనని చెప్పవచ్చు.