పాస్ పోర్ట్ గురించి కేంద్ర మంత్రి గుడ్ న్యూస్

August 13, 2020

పాస్ పోర్ట్ అవ‌స‌ర‌మా?  అప్లై చేస్తే వ‌చ్చేందుకు ఎంతకాలం ప‌డుతుంద‌న్న సందేహం అక్క‌ర్లేదు. ఎందుకంట.. పాస్ పోర్ట్ క‌ష్టాల‌కు చెల్లుచీటి ఇచ్చేసిన వైనాన్ని కేంద్ర‌మంత్రే స్వ‌యంగా చెబుతున్నారు. గ‌తంలో మాదిరి పాస్ పోర్ట్ కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. 
పాస్ పోర్ట్ అప్లై చేసిన‌ప్పుడు అన్ని అంశాలు స‌రిగా ఉంటే కేవ‌లం 11 రోజుల్లోనే పాస్ పోర్ట్ ఇచ్చేస్తున్న విష‌యాన్ని తాజాగా కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల స‌హాయ‌మంత్రి ముర‌ళీధ‌ర‌న్ వెల్ల‌డించారు. పాస్ పోర్ట్ కోసం ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్న‌ట్లుగా కాంగ్రెస్ ఎంపీ మ‌నీశ్ తివారీ ప్ర‌శ్నించ‌గా.. అందుకు స‌మాధానం ఇచ్చిన మంత్రి.. ప‌ద‌కొండు రోజుల్లోనే పాస్ పోర్ట్ ను ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.  
పాస్ పోర్ట్ ను జారీ చేసేందుకు పోలీసు వెరిఫికేష‌న్ కోసం 731 కేంద్రాల్లో యాప్ ను ఉప‌యోగిస్తున్నార‌ని.. దీంతో త్వ‌ర‌గా.. ఎలాంటి అవినీతికి అవ‌కాశం ఇవ్వ‌కుండా పాస్ పోర్ట్ జారీ చేస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా 36 పాస్ పోర్టు కేంద్రాలు ఉన్నాయ‌ని.. 93 పాస్ పోర్ట్ సేవాకేంద్రాలు ఉన్న‌ట్లు చెప్పారు. పాస్ పోర్ట్ జారీలో గ‌తంలో మాదిరి ప‌రిస్థితులు లేవ‌ని.. త్వ‌ర‌గా వ‌చ్చేస్తుంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు.