ఛార్మీ.. కామ‌న్ సెన్స్ లేదా?

August 13, 2020

ఫిలిం సెల‌బ్రెటీలు కొన్నిసార్లు కామ‌న్ సెన్స్ లేకుండా చేసే ట్వీట్లు దుమారం రేపుతుంటాయి. వేరే వ్య‌క్తుల‌కు విషాదంలా అనిపించే విష‌యాల‌పై జోకులు పేల్చి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటూ ఉంటారు సినీ జ‌నాలు. పెద్ద మ‌నిషి త‌ర‌హాలో ఉండే అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి వాడు కూడా ఒక సంద‌ర్భంలో కామ‌న్ సెన్స్ కోల్పోయాడు. మ‌లేషియాకు చెందిన ఓ విమానం స‌ముద్రంలో జాడ లేని చోట కూలిపోయి వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతే.. ర‌జ‌నీ ఇక ఆట‌లు మాని విమానం ఆచూకీ చెప్పాలంటూ జోక్ పేల్చి విమ‌ర్శ‌లెదుర్కొన్నాడు.
ఇక ఈ మ‌ధ్య క‌రోనా వైర‌స్ మీద ఇదే త‌ర‌హాలో జ‌నాల కామెడీ హ‌ద్దులు దాటుతోంది. ఈ వైర‌స్ ధాటికి స్టాక్ మార్కెట్లు కుప్ప‌కూలిపోవ‌డాన్ని ఉటంకిస్తూ షేర్లు కొనుక్కోవ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం అంటూ కామెడీ చేసే ప్ర‌య‌త్నం చేశాడు యువ క‌థానాయ‌కుడు నిఖిల్ సిద్దార్థ‌. ఓప‌క్క ఈ వైర‌స్ కార‌ణంగా వేలమంది ప్రాణాలు కోల్పోయి.. ప్ర‌పంచం అంతా వ‌ణికిపోతుంటే దీని మీద కామెడీ చేయ‌డం ఏంటంటూ నిఖిల్‌ను త‌గులుకున్నారు నెటిజ‌న్లు.
ఆ అనుభ‌వం త‌ర్వాత కూడా కొంద‌రు సెల‌బ్రెటీలు శ్రుతి మించుతున్నారు. తాజాగా ఛార్మి అయితే మ‌రీ టూమ‌చ్‌గా ఒక వీడియో వ‌దిలింది. ఇద్ద‌రు ఇండియ‌న్స్ క‌రోనా వైర‌స్ బారిన ప‌డటం, అందులో ఒక‌రు తెలంగాణ వాసి కావ‌డంతో భాగ్య‌న‌గ‌రంలో జ‌నాలు వ‌ణికిపోతున్నారు. అత‌డితో కాంటాక్ట్ ఉన్న 90 మందిని ప్ర‌భుత్వం ప‌ర్య‌వేక్షిస్తుండ‌టంతో ఈ వైర‌స్ ఎక్క‌డ వ్యాపిస్తోందో అని భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి సమ‌యంలో ఇదేదో కామెడీ వ్య‌వ‌హారంలాగా క‌రోనా వైర‌స్ మ‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిందంట‌.. వెల్కమ్ అంటూ న‌వ్వులు చిందిస్తూ వీడియో వ‌దిలింది ఛార్మీ. ఇలాంటి విచార‌క‌ర, భ‌యాన‌క విష‌యం గురించి ఇలాంటి వీడియో పెట్టిన ఛార్మిని కామ‌న్ సెన్స్ లేదా అంటూ నెటిజ‌న్లు తిట్టిపోస్తున్నారు.