ఈ చీటర్ తెలివికి మీరు ఫిదా అవుతారంతే...

April 05, 2020

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ ఆఫీస్ బాయ్ ఓ మహిళా న్యాయవాది (73) నుంచి రూ. 50 లక్షలు వెలుగులోకి వచ్చింది. అసలు మ్యాటర్ లోకి వెళితే ఆఫీస్ బాయ్‌గా పనిచేసే వీరబత్తిని నరేష్ కుమార్ పలు పేర్లతో చలామణి అవుతూ సినీ నిర్మాతగా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జ‌స్ట్ డ‌య‌ల్‌ ద్వారా పరిచయం అయిన హైదరాబాద్‌ చెందిన ఓ మహిళా న్యాయవాదిని సైతం తాను నిర్మాత అన్న విషయం నమ్మించాడు. తాను రాజమౌళితో సినిమా తెరకెక్కిస్తున్నా అని... ఈ సినిమా పేరు ఆర్ ఆర్ ఆర్ అని అందులో హీరోకు తల్లి పాత్రలో నటించే ఆసక్తి ఉందా ? అని సదరు న్యాయవాదిని ప్రశ్నించాడు.

ఏకంగా రాజమౌళి సినిమా అని చెప్ప‌డంతో ఆ మహిళా న్యాయవాది తనకు గతంలో నటనా పరమైన అనుభవం ఉందని... ఈ సినిమాలో చేస్తానని ఒప్పుకుంది. ఇదే అదునుగా ఆమెకు పలు మాయమాటలు చెప్పిన‌ నిందితుడు మూడు వేర్వేరు ఫోన్ నెంబర్ల నుంచి రాజమౌళి గొంతును ఇమిటేట్ చేస్తూ ఆమెతో మాట్లాడాడు. ఈ సినిమాలో మీ పాత్ర గ్యారెంటీ అయితే ఇందుకోసం ఫిల్మ్ ఛాంబ‌ర్‌తో పాటు మా టీవీ సీరియ‌ల్ న‌టి గుర్తింపులు కావాల‌ని చెప్పి ఆమె ద‌గ్గ‌ర రూ.50 ల‌క్ష‌లు వ‌సూలు చేశాడు.

ఈ మొత్తాన్ని త‌న స్నేహితుల‌కు చెందిన 15 బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆ త‌ర్వాత త‌న కారు రిపేరు ఉంద‌ని చెప్పి ఆమె కారు కూడా తీసుకుని వాడుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం మ‌ళ్లీ ఫోన్ చేసి మ‌రింత డ‌బ్బు కావాల‌ని అడ‌గ‌గా... ఆమె త‌న వ‌ద్ద డ‌బ్బులేద‌ని చెప్ప‌డంతో పాటు కారు విష‌య‌మై ప్ర‌శ్నించింది. కారు ఇవ్వ‌ను అని చెప్పిన అత‌డు ఆమెను తీవ్రంగా దుర్భాష‌లాడ‌డంతో ఆమెకు తాను మోస‌పోయాన‌న్న విష‌యం అర్థ‌మైంది.

ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా రంగంలోకి దిగిన సెంట్ర‌ల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అత‌డు అక్కౌంట్లు వాడుకున్న ఇద్ద‌రి స్నేహితుల‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గ‌తంలోనూ నిందితుడిపై ఇలాంటి కేసులే ఉండ‌డంతో న్యాయ‌స్థానం నాన్‌బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. ఏదేమైనా రాజ‌మౌళి పేరు చెప్పుకుని కూడా చివ‌ర‌కు ఇలా మోసాల‌కు పాల్ప‌డుతున్నారు.