కేంద్రం తెచ్చిన కీలక చట్టం... ఇక వాటికి భయపడాలి

August 10, 2020

కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మాయదారి రోగం వణికిస్తున్న వేళ.. వ్యాపార.. వాణిజ్య వర్గాలకు ఊరటనిచ్చేలా కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న తప్పుల్ని పెద్ద పెద్ద నేరాలుగా పరిగణించే విధానానికి చెక్ పెట్టేయటం గమనరా్హం. ఖాతాల్లో బ్యాలెన్సు లేక చెక్ బౌన్స్ కావటం గతంలో క్రిమినల్ నేరంగా పరిగణించేవారు. అలాంటి వాటిని మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

ఇలాంటివాటికి సంబంధించిన మొత్తం 19 చట్టాల్ని తగురీతిలో మార్ప్ులు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనల్ని రూపొందించింది. చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేయటం అన్నది వ్యాపారాలు చేసే వారికి ఊరటనిచ్చేలా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం కారణంగా న్యాయవ్యవస్థలపైనా.. జైళ్లపైనా ఒత్తిడి తగ్గే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక శాఖ చేసిన తాజా ప్రతిపాదనలపై కేంద్ర న్యాయశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అయితే... చెక్కు బౌన్స్ అనేది క్రిమినల్ కేసు అయినా కొందరు ఎగ్గొట్టడానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఇక జైలు కెళ్లరు అంటే దీనిని ఎవరూ లెక్కచేయరు. దీనివల్ల భవిష్యత్తులో చెక్కులపై అనుమానాలు పెరుగుతాయి. వాటిని తీసుకున్నా డబ్బు వస్తుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి చెక్ పేమెంట్స్ లో ఇక ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ చట్టం అమలైతే. 

ప్రస్తుతం నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ 1881లోని సెక్షన్‌ 138 కింద ఖాతాలో తగిన బ్యాలెన్స్‌ లేని కారణంగా చెక్‌ బౌన్స్‌ అయితే దాన్ని జారీ చేసిన వ్యక్తి నేరం చేసినట్లుగా పరిగణించేవారు. క్రిమినల్ నేరం కిందకు తీసుకొని ఈ నేరం నిరూపితమైతే..  రెండేళ్ల వరకు జైలుశిక్ష  లేదంటే చెక్‌ పరిమాణానికి రెట్టింపు పెనాల్టీ విధించే అవకాశం చట్టం ఇచ్చేది.

కొన్నిసార్లు జైలుతో పాటు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. తాజా ప్రతిపాదన ప్రకారం దీన్ని మార్చనున్నారు. అయితే.. ఇప్పటివరకూ శిక్షల భయంతో జాగ్రత్తగా ఉండేవారు.. మార్పులు చేస్తే.. కొందరు దాన్నో అవకాశం తీసుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టాల మార్పు దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చెబుతున్నారు.

సవరణలకు సంబంధించి ప్రతిపాదనలు చేసిన చట్టాలు ఇవే..

► నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (చెక్‌ బౌన్స్‌ కేసులు)
► సర్ఫేసీ (బ్యాంకు రుణాల రీపేమెంట్‌ విషయంలో చోటు చేసుకునే ఉల్లంఘనలు)
► ఎల్ఐసీ.. పీఎఫ్ఆర్‌డీఏ.. ఆర్‌బీఐ పత్రాలకు సంబంధించినవి
► ఎన్‌హెచ్‌బీ.. బ్యాంకింగ్‌ నియంత్రణ
► చిట్‌ ఫండ్స్‌ .. యాక్చువేరీస్‌ అంశాలు
► జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌
► అనియంత్రిత డిపాజిట్‌ స్కీముల నిషేధ చట్టం
► డీఐసీజీసీ.. నాబార్డ్‌..  బీమా చట్టానికి సంబంధించినవి
► ప్రైజ్‌ చిట్స్, మనీ సర్క్యులేషన్‌ స్కీమ్స్‌ (నిషేధ)
► పేమెంట్‌ అండ్‌ సెటిల్మెంట్స్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌
► స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్స్‌
► క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీస్‌ (నియంత్రణ)
► ఫ్యాక్టరింగ్‌ నియంత్రణ చట్టం