రేష‌న్‌తో పాటు లైవ్ చికెన్‌

August 03, 2020

లాక్ డౌన్ వేళ‌.. క‌నీస స్థాయిలో స‌రుకులు దొర‌క‌డం కూడా క‌ష్టంగా ఉంది కొన్ని చోట్ల‌. ఇంట్లో ఖాళీగా ఉన్నాం క‌దా.. ఓ ప‌ట్టు ప‌డ‌దాం అంటే కోరుకున్న రుచులకు త‌గ్గ‌ట్లుగా స‌రంజామా దొరికే ప‌రిస్థితి లేదు. మామూలు కూర‌లు వండుకోవ‌డానికి స‌రిప‌డా స‌ర‌కులు ఇంటికి చేరితే చాలు అన్న‌ట్లుంది ప‌రిస్థితి. అలాంటిది తూర్పుగోదావ‌రి జిల్లాలో రేష‌న్‌తో పాటుగా లైవ్ చికెన్‌ను అందుబాటులో పెట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.
తూర్పుగోదావ‌రిలోని అమ‌లాపురంలో ఈ చిత్రం చోటు చేసుకుంది. అక్క‌డ రేష‌న్‌తో పాటుగా లైవ్ చికెన్ ఇస్తున్నారు. ఐతే చికెన్ ఉచితంగా ఇస్తున్నారా.. అమ్ముతున్నారా అన్న‌ది తెలియ‌డం లేదు కానీ.. వ‌రుస‌గా బ‌ల్ల‌ల మీద రేష‌న్ స‌ర‌కుల‌తో పాటు లైవ్ కోడిని పెట్టి ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. లాక్ డౌన్ కార‌ణంగా బ‌య‌ట చికెన్ షాపుల్లో కూడా చికెన్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతోంది.
కొన్ని రోజుల పాటు అయితే షాపులే తెర‌వ‌లేదు. జ‌నాలు కూడా చికెన్ తింటే క‌రోనా వ‌స్తుంద‌ని షాపుల వైపు వెళ్ల‌డం మానేశారు. దీంతో కొన్ని రోజులు మూత‌ప‌డ్డ షాపులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో అమ‌లాపురంలో రేష‌న్‌తో పాటు లైవ్ చికెన్ ఇస్తున్నార‌న్న వార్త‌లు చూసి జ‌నాలు.. ఎంతైనా గోదారోళ్ల మ‌ర్యాదే మ‌ర్యాద అంటూ కామెంట్లు పెడుతున్నారు.