వైసీపీ నేత మర్రి రాజశేఖర్ ని టార్గెట్ చేస్తున్నదెవరు?

August 04, 2020

మీడియాను సోషల్ మీడియా ప్రభావితం చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. సోషల్ మీడియాతోపాటు.. వాట్సాప్ మెసేజ్ లతో ఉలిక్కిపడే ప్రధాన మీడియా.. కొన్నిసార్లు వెనుకా ముందుచూసుకోకుండా స్క్రోలింగ్ లు వేసేయటం.. తర్వాత చెక్ చేసుకొని నాలుకర్చుకోవటం ఈ మధ్యన అలవాటుగా మారింది. చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాలు.. తర్వాతి కాలంలో వార్తాంశాలుగా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి పరిణామం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది.

ఏపీ అధికారపక్షంలో ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఆదివారం సోషల్ మీడియాలో చిలుకలూరి పేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మర్రి రాజశేఖర్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. గత ఎన్నికల్లో అధినేత మాట కోసం తన సీటును త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ అయినట్లుగా  ప్రచారం సాగింది.

పార్టీలోకి వచ్చిన కొత్త నాయకురాలి కోసం సీటును త్యాగం చేసిన ఆయనకు.. తాజాగా భర్తీ చేయనున్న ఎమ్మెల్సీల్లో ఒక సీటు ఆయనకు కేటాయించినట్లుగా పేర్కొన్నారు. ఒకదశలో అయితే.. మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ బెర్త్ ఖరారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. కాకుంటే.. ఈ అంశంపై పార్టీ అధికారిక ప్రకటన ఏమీ చేయకపోవటం గమనార్హం.

ఎమ్మెల్సీ ఆశావాహుల్లో ఆయన తొలిస్థానాల్లో ఉన్నారని చెప్పాలి.  పార్టీ అధినాయకత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాక ముందే.. ఎమ్మెల్సీ బెర్తు కన్ఫర్మ్ అయినట్లుగా జరిగిన ప్రచారం వెనుక ఎవరున్నారు? వారి ఉద్దేశం ఏమిటి? అధినేత జగన్ కు చిరాకు పుట్టించే ప్రయత్నంలో భాగంగా ఎవరైనా ఇలా చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాజకీయాల్లో కొన్నిసార్లు జరిగే అనవసర ప్రచారంతో రావాల్సిన పదవులు చేజారిపోతుంటాయి. మర్రి రాజశేఖర్ విషయంలో ఇలాంటి ఎత్తుగడ ఏమైనా అమలు చేస్తున్నారా? అన్న సందేహం ఆయన వర్గీయులు వ్యక్తం చేయటం గమనార్హం.

అయితే.. వైఎస్ విధేయుడు అయిన ఈయనకు కాదని ఎమ్మెల్యే టిక్కెట్ ను విడదల రజనికి కేటాయించారు. ఇపుడు ఆమె ఏకు మేకయ్యారు. మర్రి మాట లెక్కచేయడం లేదు. ఎంపీ పైనే అనుచరులను దాడికి పంపుతున్నారు. ఒక ఫైర్ బ్రాండ్ గా మారి స్వతంత్రంగా వ్యవహరిస్తున్న రజనీ వ్యవహారం అధిష్టానం వద్ద పంచాయతీ అయ్యింది. వారే రాజశేఖర్ ను బ్యాడ్ చేయడానికి ఇలా గాసిప్ లు సృష్టించారా? అని కొందరు మర్రి అభిమానులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.