ఆ రోజు చైనా నిర్లక్ష్యమే ఈరోజు ప్రపంచానికి నష్టమా?

August 07, 2020

కొద్ది రోజుల్లో ప్ర‌ళ‌యం రాబోతోందని `2012`(యుగాంతం)సినిమాలో ఓ భార‌తీయ యువ శాస్త్ర‌వేత్త‌ ముందుగానే ప‌సిగ‌డ‌తాడు. ప్ర‌కృతి విల‌య తాండ‌వం చేస్తుంద‌ని, ర‌క‌ర‌కాల విప‌త్తుల‌తో యుగాంతం అవుతుంద‌ని హెచ్చరిస్తాడు. ఆ భార‌తీయుడి మాట‌ల‌ను అత‌డి స్నేహితుడైన మ‌రో అమెరిక‌న్ శాస్త్ర‌వేత్త విశ్వ‌సిస్తాడు. ఇదే విష‌యాన్ని మ‌రో ప్ర‌ముఖ సైంటిస్ట్‌కు చెబితే....ఆ థియ‌రీని అవ‌హేళ‌న చేస్తాడు. చివ‌ర‌కు ఆ ఇద్ద‌రు యువ శాస్త్ర‌వేత్త‌లు చెప్పిందే నిజ‌మ‌వ‌బోతోందని నిర్థారించుకొని యుద్ధ ప్రాతిప‌దిక‌న పారిపోయే ప్ర‌య‌త్నాలు చేస్తారు. అయితే, అప్పటికే...జ‌ర‌గాల్సిన న‌ష్టం..స‌గం జ‌రిగిపోతుంది. స‌రిగ్గా ఈ సినిమాలోని భార‌తీయ శాస్త్ర‌వేత్త త‌ర‌హాలోనే కరోనా వైరస్ మ‌హ‌మ్మారి ఈ ప్రపంచాన్ని కబళించబోతోందంటూ ఓ చైనా డాక్ట‌ర్ హెచ్చరించాడు. ఇత‌డి మాట‌ల‌ను తొలుత పెడ‌చెవిన పెట్టిన చైనా స‌ర్కార్....త‌ర్వాత న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే, అప్ప‌టికే ప‌రిస్థితి చేయి దాటిపోవ‌డంతో.....ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఆ యువ వైద్యుడు మృతి చెందాడు.

చైనాలోని వుహాన్‌కు చెందిన‌ డాక్టర్ లీ వెన్‌లియాంగ్ (34) క‌రోనా పుట్టిల్లైన‌ వుహాన్ సెంట్రల్ ఆసుపత్రిలో ప‌నిచేస్తున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో సీఫుడ్ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతతో ఆ ఆసుపత్రిలో చేరారు. వారిని పరీక్షించిన లీ వారిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన లీ...ఈ వైరస్ తీవ్ర ప్రమాదకరమని ప్రపంచాన్ని హెచ్చరించాడు. ప్ర‌పంచాన్ని క‌రోనా క‌బ‌లించ‌బోతోందంటూ డిసెంబరు 30న సోషల్ మీడియాలో వార్నింగ్ బెల్ మోగించారు.
‘సార్స్’ లాంటి ప్రమాదకర వైరస్ వుహాన్‌లో విస్తరిస్తోందని ప్ర‌భుత్వాన్ని హెచ్చరించారు.

అయితే, ఈ పోస్టును సీరియ‌స్‌గా తీసుకొని..ఆ వైర‌స్‌పై ప‌రిశోధ‌న చేయాల్సిన చైనా స‌ర్కార్.....రివ‌ర్స్‌లో లీపై చ‌ర్య‌లు తీసుకుంది. ఆ పోస్టును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అతడిని నానా తిప్ప‌లు పెట్టింది. వైరస్ గురించి అపోహలు ప్రచారం చేస్తున్నాడంటూ లీని పోలీసులు  నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిరోజుల‌కు లీ చెప్పిన‌ట్లుగానే క‌రోనా వైరస్ విజృంభించింది. లీ చెప్పిన వాస్త‌వాన్ని ఆలస్యంగా గుర్తించిన చైనా...యుద్ధ‌ప్రాతిప‌దిక‌న న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే, అప్ప‌టికే లీ కూడా కరోనా బారిన పడ్డారు. గత నెల 12 నుంచి చికిత్స పొందుతున్న లీ గురువారం అర్ధరాత్రి దాటాక 2:58 గంటలకు కన్నుమూశారు.

ఈ వార్త మీడియా, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. లీ చెప్పిన‌పుడే చైనా ప్ర‌భుత్వం స్పందించి ఉంటే..క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించి ఉండ‌వ‌చ్చ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌మాజానికి మంచి చేయాల‌నుకున్న లీ వంటివారిని అణ‌చివేయ‌డం వ‌ల్లే ఇపుడు చైనా మూల్యం చెల్లించుకుంటుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. లీ ఇచ్చిన వార్నింగ్‌ను ప‌ట్టించుకొని ఉంటే....అత‌డితో పాటు వంద‌లాది మంది ప్రాణాలు ద‌క్కి ఉండేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని ధిక్క‌రించి మ‌రీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన లీ నిజ‌మైన హీరో అని నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. `కరోనా`మ‌ర‌ణాలు...చైనా ప్ర‌భుత్వ హ‌త్య‌ల‌ని, ఈ వైర‌స్ వ్యాప్తికి చైనా ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ని విమ‌ర్శిస్తున్నారు. లీ వంటి వారు చేసిన‌ హెచ్చ‌రిక‌లను, సూచ‌న‌ల‌ను మిగ‌తా దేశాల వారు పెడ‌చెవిన పెట్ట‌కుండా ఉంటే ప‌లు స‌మస్య‌ల‌ను ముందుగానే ప‌రిష్క‌రించ‌వచ్చ‌ని నెటిజ‌న్లు సూచిస్తున్నారు.