స్వామీజీ... బాబుపై ఒట్టును గ‌ట్టున పెట్టేశారా?

May 26, 2020

చిన జీయ‌ర్ స్వామి... ఇప్పుడున్న స్వామీజీల్లో మంచి పేరున్న స్వామీజీనే. హైద‌రాబాద్ స‌మీపంలోని శంషాబాద్ ప‌రిస‌రాల్లో ఆశ్ర‌మాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ స్వామీజీ వ‌ద్ద‌కు చాలా మంది రాజ‌కీయ నేత‌లు క్యూ క‌డుతున్న వైనం మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. ఇత‌ర రాష్ట్రాల పొలిటీషియ‌న్ల‌ను ప‌క్క‌న‌పెడితే... టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు ఈ స్వామీజీ అంటే ఎంత న‌మ్మ‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంతేనా... ఏపీలో విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కూడా ఈ స్వామీజీ చెప్పిందే వేదమ‌న్న విష‌యం కూడా తెలిసిందే క‌దా. స‌రే.. రాజ‌కీయ నాయ‌కులంటే త‌మ భవిష్య‌త్తు కోస‌మో, త‌మ మేలు కోస‌మో స్వామీజీల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అయితే దైహిక సుఖాల‌ను విడిచేసిన స్వామీజీల‌కు వ్యక్తిగ‌త ప్ర‌యోజ‌నాలు, కొంద‌రికే మేలు చేసే త‌త్వం ఉండ‌దు క‌దా.

మ‌రి చిన‌జీయ‌ర్ ను చూస్తే... స్వామీజీల‌కు కూడా సొంత ఎజెండాలు ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేసీఆర్‌, జ‌గ‌న్ ల‌ను కారు వ‌ద్ద‌కు వ‌చ్చి ఆశ్ర‌మంలోకి తీసుకెళ్ల‌డంతో పాటుగా కారు వ‌ద్ద‌కు వ‌చ్చి సాగ‌నంప‌డం దాకా చేసే ఈ స్వామీజీ... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అంటే ఎందుకు ప‌డ‌దో అర్థం కాదు. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ విజ‌యం సాధించ‌డం, ప‌దేళ్ల త‌ర్వాత చంద్ర‌బాబు మ‌రోమారు సీఎం ప‌ద‌విలో కూర్చోవ‌డం జ‌రిగిపోయింది. ఆ త‌ర్వాత ఓ సంద‌ర్భంలో అస‌లు చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా ఏపీలో అడుగుపెట్టేది లేద‌ని, చివ‌ర‌కు చంద్ర‌బాబు పాల‌న ముగిసేదాకా తిరుమ‌ల కొండ‌పైనా అడుగు పెట్టేది లేదని దాదాపుగా శ‌ప‌థం చేసినంత ప‌ని చేశారు.

అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఓ ఫొటోను చూస్తుంటే... ఈ శ‌ప‌థాన్ని స్వామీజీ గంగలో క‌లిపేశారా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్‌, జ‌గ‌న్ ల‌ను చాలా ఇష్ట‌మైన వ్య‌క్తులుగా ప‌రిగ‌ణించే చిన‌జీయ‌ర్‌... ఇప్పుడు చంద్ర‌బాబు ముందు నిల‌బ‌డి చేతులు పిసుక్కుంటూ నిల్చున్నారు. ఈ ఫొటోను చూస్తుంటే... నిజంగానే స్వామీజీ గేమ్ ప్లాన్ లో ఏదో తేడా కొట్టేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ మార్పు... ఏపీలో మ‌రోమారు టీడీపీ విజ‌యం సాదించ‌డం, మ‌రోమారు చంద్ర‌బాబు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌న్న భావ‌న‌తోనే స్వామీజీలో వ‌చ్చిందా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.