జ‌గ‌న్‌కు మాజీ ఎంపీ వింత సూచ‌న‌...

January 22, 2020

మాజీ ఎంపీ చింతా మోహ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ప్ర‌ధానంగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య వివాదం జ‌రుగుతున్న నేప‌థ్యంలో రంగ ప్ర‌వేశం చేసిన మోహ‌న్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయాలను వేడెక్కిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లో ఉన్న మోహ‌న్ తిరుప‌తి నుంచి అదే పార్టీ టికెట్‌పై ఎంపీగా విజ‌యం సాధించారు. 2012లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న ఏ పార్టీలోనూ చేర‌క‌పోయినా.. త‌ట‌స్థ రాజ‌కీయాలు మాత్రం చేస్తున్నారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై స‌టైర్లు వేస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు కూడా చేశారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తి వ‌ద్ద‌ని, తిరుప‌తి అయితే, అన్ని వ‌ర్గాల‌కు ఆమోద యోగ్యంగా ఉంటుంద‌ని చింతా చేసిన వ్యాఖ్య‌లు కొన్నాళ్ల కింద‌ట వేడెక్కించాయి.

ఎలాగూ వెనుక‌బ‌డిన ప్రాంతంగా ఉన్న రాయ‌ల‌సీమ‌లో ప్ర‌ముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుప‌తికి దేశ విదేశాల నుంచి కూడా భ‌క్తులు వ‌స్తార‌ని, ఈ ప్రాంతంపై ఎవ‌రికీ ఎలాంటి అభిప్రాయ భేదాలు కూడా లేవ‌ని సో.. జ‌గ‌న్ ఇక్క‌డ రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నిరోజులు ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే, తాజాగా మ‌రో కీల‌క వ్యాఖ్య ద్వారా చింతా మోహ‌న్ మ‌రింత సంచ‌ల‌నం సృష్టించారు. జ‌గ‌న్ పాల‌న బాగానే ఉంద‌ని వ్యాఖ్యానిస్తూనే.. ఆయ‌న‌కు మ‌రింత‌గా క‌లిసి రావాలంటే.. రాజ‌ధాని అమ‌రావ‌తిలోని తుళ్లూరు ప్రాంతానికి వెళ్ల‌కుండా ఉంటేనే మంచిద‌ని, ఆ ప్రాంతం శాప‌గ్ర‌స్థ ప్రాంత‌మ‌ని చింతా చెప్పుకొచ్చారు.

పాల‌న‌లో మ‌రింత వైరుధ్యం చూపించాల‌ని భావిస్తున్న జ‌గ‌న్‌.. తుళ్లూరు ప్రాంతాన్ని వీడాల‌ని స‌ల‌హా ఇచ్చారు. మ‌రో మంచి ప్రాంతం నుంచి ఆయ‌న పాల‌న ప్రారంభిస్తే.. అన్నీ స‌వ్యంగానే సాగుతాయ‌ని సూచించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో భారీగా వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై నెటిజ‌న్లు త‌లోర‌కంగా స్పందిస్తున్నారు. ఇక‌, అదే స‌మ‌యంలో హైద‌రాబాద్ పైనా చింతా మోహ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని, ఈ ఎన్నిక‌ల త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాల‌ని చూస్తోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో చాలా మంది కాంగ్రెస్ నాయ‌కులు దీనినే కోరుకున్నార‌ని అన్నారు. హైద‌రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాల‌ని ఏపీకి చెందిన చాలా మంది నాయ‌కులు కేంద్రాన్ని అప్ప‌ట్లో కోరుకున్న విష‌యాన్ని కూడా చింతా తాజాగా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read Also

జగన్ దిగిరాక తప్పలేదు... ఇదే రీజన్
సూపర్ ఫాస్ట్ గా చంద్రబాబు 
జాతీయ మీడియాలో జగన్ గాలిపోయింది