తప్పును ఒప్పుకున్న చిరంజీవి, తమ్ముడు మాత్రం కరెక్టే

April 03, 2020

మెగాస్టార్ చిరంజీవి... తెలుగు రాజకీయ చరిత్రలో కచ్చితంగా స్పెషల్ పేజీ సంపాదించుకున్న పేరు. రాజకీయాల్లో ఆయన ఒక పెద్ద పాఠం, గుణపాఠం. ఆదరణ, డబ్బు మాత్రమే రాజకీయాలకు చాలదని, ఇంకేదో కావాలని చిరంజీవి నిరూపించారు. అందుకే ఇండస్ట్రీ మెగాస్టార్ రాజకీయాల్లో పాస్ మార్కులు కూడా సంపాదించుకోలేకపోయారు. తాజా ఆయన మరోసారి రాజకీయాల గురించి నోరు విప్పారు. తన గురించి తనే సంచలన విషయాలు వెల్లడించారు.
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా నెం.1 కి ఎదిగిన చిరంజీవి... సినిమా రంగంలో అసామాన్యుడు. అసాధారణ గుర్తింపు పొందిన వారు. కానీ అది రాజకీయంలో రాణించడానికి ఆయనకు మైనస్ అయ్యిందే గాని ప్లస్ కాలేదు. తాను ఎంతో కాలం రాజ‌కీయాల్లో మ‌న‌లేక‌పోయాడు. చివ‌రికి రాజ‌కీయాలు విడిచిపెట్టి సినిమాల్లోకి వచ్చిన చిరు తాజాగా సైరా సినిమాతో ప్రభంజనంలా ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... సినిమా వాళ్లు రాజకీయాల్లోకి పనికిరారు అన్నట్లు చెప్పారు. మరి తమ్ముడి సంగతి ఏంటి అంటే... అతను పుట్టుకతోనే ప్రజాసేవకుడు అతను సినిమాలకు కాదు, రాజకీయాలకే పనికొస్తాడు అని చెప్పాడు చిరంజీవి. ఇంకా ఏమన్నారంటే...‘‘రాజ‌కీయాల్లో నాతో పోలిస్తే ప‌వ‌న్ భిన్న‌ం. కాబ‌ట్టి అత‌నీ రాజకీయ రంగంలో రాణిస్తాడు. నేను న‌టుడిగా జ‌నాల నుంచి అపార‌మైన ప్రేమ‌ను పొందాను. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ఇక్క‌డ స్పంద‌న త‌న‌కు రుచించ‌లేదు. రాజకీయాల్లోని కుట్ర‌లు కుతంత్రాల్ని, ఎదురు దెబ్బ‌ల్ని త‌ట్టుకోలేక‌పోయాను. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌ప్పు చేశాను. ప‌వ‌న్ విషయానికి వస్తే... నాతో పోలిస్తే అతను చాలా స్ట్రాంగ్. ఎలాంటి ఎదురు దెబ్బ‌ల్న‌యినా, కుట్ర‌ల్న‌యినా త‌ట్టుకుంటాడు. నాకు సినిమాల మీద ఎంతో ప్యాష‌న్‌. కానీ ప‌వ‌న్ అనుకోకుండా న‌ట‌న‌లోకి వ‌చ్చాడు. అత‌డి ప్యాష‌న్ అంతా రాజ‌కీయాల‌తోనే ముడి ప‌డి ఉంది. జనాలకు మంచి చేయాలన్న తపన చిన్న‌ప్ప‌ట్నుంచి అతడికుంది. రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా త‌ట్టుకుని నిల‌బ‌డతాడు‘‘ అంటూ చిరంజీవి తన గురించి తన తమ్ముడి గురించి చెప్పుకొచ్చాడు.