రజనీ.. కమల్ కు చిరంజీవి ఇచ్చిన సలహా ఏంటి?

May 29, 2020

కొన్నిసార్లు అంతే. ఎవరెన్ని సలహా ఇచ్చినా మనసుకు ఎక్కవు. కానీ.. సొంతంగా అనుభవం ఎదురైనప్పుడు మాత్రం కళ్లు తెరుచుకోవటమే కాదు.. అప్పటివరకూ తాము వినని సలహాల్ని.. ఎదుటోళ్లకు ఇచ్చేందుకు సిద్ధమవుతుంటారు. ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల్లోకి వద్దామని డిసైడ్ అయిన వేళ.. కొందరు చిరును పాలిటిక్స్  లోకి వెళ్లొద్దన్నారు. సున్నితమనస్కుడైన చిరంజీవి లాంటోళ్లు రాజకీయాల్లో రాణించలేరని.. అలాంటి వారికి ఎదురుదెబ్బలు తప్పవన్నారు.
అయినా.. అలాంటి సలహాల్ని.. సూచనల్ని వినని మెగాస్టార్.. ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయటం.. ఎదురుదెబ్బలు తినటం.. తర్వాతి కాలంలో పార్టీని విలీనం చేసేసి పెద్ద ఎత్తున విమర్శలపాలు కావటం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ఆయన.. చివరకు రాజకీయాలకు దూరంగా ఉండటం షురూ చేశారు.
సైరా విడుదల నేపథ్యంలో పెద్ద ఎత్తున మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్న మెగాస్టార్.. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. విశ్వనటుడు కమల్ హాసన్ లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే డబ్బుమయంగా మారాయన్న చిరు.. వారిద్దరిని తాను రాజకీయాల్లో రావొద్దనే చెబుతానన్నారు.
నిజాయితీగా ప్రజలకు ఏదైనా చేద్దామనుకుంటే ఏమీ చేయలేరని.. రాజకీయాల్లో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చే సమయానికి నంబర్ వన్ గా ఉండేవాడినని.. అన్ని వదులుకొని రాజకీయాల్లోకి వస్తే.. సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయిన వైనాన్ని గుర్తు చేశారు. తన ప్రత్యర్థులు కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి ఓడించారన్నారు.
అదే విధంగా పవన్ కు అలాంటి అనుభవమే ఎదురైందన్నారు. ఈ కారణంతోనే తమిళ అగ్రనటులైన రజనీకాంత్.. కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి రాకపోవటమే మంచిదన్నారు. సౌమ్యంగా ఉండే వ్యక్తులకు రాజకీయాలు టీ తాగినంత సులభం కాదన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ గెలుస్తుందని తాను అనుకున్నా.. అలా జరగలేదన్నారు.  ఓటములు.. ఎదురుదెబ్బలు తగిలినా.. ప్రజలకు మంచి చేయాలనుకుంటే మాత్రం రాజకీయాల్లోకి రావొచ్చన్నారు. రాజకీయంగా చిరు భావజాలాన్ని అంగీకరించని ఆయన రక్తం పంచుకు పుట్టిన తమ్ముడే అంగీకరించని వేళ.. రజనీ.. కమల్ హాసన్ లకు ఆయన మాటలు చెవికి ఎక్కుతాయా? అన్నది క్వశ్చనే.