ఊహించ‌ని రీతిలో రియాక్ట్ అయిన మెగాస్టార్!

July 04, 2020

ఒక్కొక్క మెట్టు క‌ట్టుకుంటూ ఎక్కి వ‌చ్చిన వారికి డ‌బ్బు విలువ బాగా తెలుస్తుందంటారు. ఇలాంటి వారు ఖ‌ర్చు విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం క‌నిపించేదే. ఎంత ఎత్తుకు ఎదిగినా.. అన‌వ‌స‌రంగా రూపాయి ఖ‌ర్చు చేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. జీవితంలో వారు చూసిన క‌ష్ట‌న‌ష్టాలు.. వారిని అలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
మెగాస్టార్ చిరు విష‌యానికి వ‌స్తే.. ఈస్థాయికి రావ‌టానికి ఆయ‌నెంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఆయ‌న‌.. మెగాస్టార్ అన్న బ్రాండ్ ను క్రియేట్ చేసుకోవ‌ట‌మే కాదు.. అంద‌నంత ఎత్తుకు ఎదిగారు. కోట్లాది మంది మ‌న‌సుల్ని దోచుకున్నారు.
అలాంటి మెగాస్టార్ ను వేలెత్తి చూపించే అంశాలు రెండే క‌నిపిస్తాయి. ఒక‌టి అన‌వ‌స‌రంగా రాజ‌కీయాల్లోకి వెళ్ల‌టం.. డ‌బ్బు ఖ‌ర్చు విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తారే కానీ.. కీల‌కమైన అంశాల్లోనూ డ‌బ్బు ఖ‌ర్చుకు వెనుకాడ‌ని తీరు అస్స‌లు క‌నిపించ‌దంటారు.
ఇక‌పై త‌న‌ను అలా వేలెత్తి చూపించ‌కూడ‌ద‌ని మెగాస్టార్ ఫిక్స్ అయిన‌ట్లుగా ఉంది. స్వ‌ర్గీయ ద‌ర్శ‌క‌ర‌త్న‌.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి పెద్ద మ‌నిషిగా ఉంటూ అంద‌రి త‌ల‌లో నాలుక‌లా మెలిగిన దాస‌రి బ‌ర్త్ డే ను పుర‌స్క‌రించుకొని డైరెక్ట‌ర్స్ డే ను నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది మే 4న వైభ‌వంగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. తాజాగా మ‌రోసారి డైరెక్ట‌ర్స్ డే కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హించారు.
ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిరు ఊహించ‌ని రీతిలో ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ద‌ర్శ‌కుల సంఘానికి త‌న వంతు సాయంగా రూ.25 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. నాలుగు రూపాయిలు సాయం చేసే విష‌యంలో మెగాస్టార్ వెన‌కుంటార‌న్న మాట ఇక‌పై అనే ధైర్యం ఎవ‌రూ చేయ‌ర‌ని చెప్పాలి. ఇదే.. తీరును కాస్త చూసుకొని మెయింటైన్ చేయండి మెగాస్టార్.