చిరంజీవిని ఏకిపారేసిన తెలుగుదేశం సీనియర్ నేత

February 22, 2020

ఏపీ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు దేశ ప్రజలకే జాలి కలిగేలా ఉన్నాయి. అక్కడ రాజకీయ కొట్లాటలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. తాజాగా కేవలం ఒక వ్యక్తి మీద, ఒక కులం మీద కక్షతో వైఎస్ జగన్ రాజధాని అమరావతిని ఎలా ఆపెయ్యాలా అని నిరంతరం శోధిస్తున్నారు. ఆ క్రమంలో ఆయనకు కలిగిన ఆలోచనే మూడు రాజధానులు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికిపుడు కావల్సింది నిధులు, ఉద్యోగాలు. ఒకటి కేంద్రం నుంచి రావాలి, ఇంకొకటి రాష్ట్రం సాధించుకోవాలి. కానీ ఈ రెండింటి మీద ఏపీ ముఖ్యమంత్రి దృష్టి పెట్టలేదు. పైగా రాష్ట్రంలో ప్రజల మధ్య రాగద్వేషాలు పెంచేలా రాజధాని తేనెతుట్టెను కదిలించారు. జగన్ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వ్యతిరేకించాయి. ఇదిలా ఉండగా ... ఎపుడూ తన ప్రాణంగా భావించే తన సొంత అన్నయ్యే జనసేన అధినేతకు రాజధాని విషయంలో ట్విస్ట్ ఇచ్చారు.

ఏపీకి బహుళ రాజధాని అంశంపై చిరంజీవి పాజిటివ్ గా స్పందించారు. మూడు రాజధానుల విషయాన్ని అందరూ స్వాగతించాలని, జగన్ రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తారన్న నమ్మకం తనుకుందని చిరంజీవి స్పందించిన విషయం తెలిసిందే. ఇది బాగా వైరల్ అయ్యింది. చిరంజీవి జనసేన నేత కాకపోయినా... పవన్ కు సొంత అన్న. పవన్ కళ్యాణ్ విధానం చిరంజీవి అభిప్రాయానికి విరుద్ధంగా ఉంది. అమరావతి మార్పు, బహుళ రాజధానుల విషయాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. అన్న బహిరంగ ప్రకటన పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

చిరు విధానంపై తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ గడ్డపై సినిమాలు, వ్యాపారాలు చేసుకునే చిరంజీవికి ఏపీ ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని సోమిరెడ్డి ప్రశ్నించారు. తమ్ముడు ప్రజల కోసం పోరాడుతున్నాడు. దానిని ప్రోత్సహించకపోగా... ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చిరు స్పందిస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. అప్పట్లో ప్రజారాజ్యం ఏర్పాటుచేసి దానిని విలీనం చేశారు. కాంగ్రెస్ లో కలసిి రాష్ట్ర విభజన పాపంలో పాలుపంచుకున్నారు. చిరంజీవి వైఖరి చూస్తుంటే... మళ్లీ రాజకీయాల్లోకి దూకేస్తాడేమో అని అనుమానం వస్తుందన్నారు. తప్పును ప్రోత్సహించొద్దని, ప్రజా పోరాటంలో తమ్ముడికి అండగా నిలవమని చిరంజీకి సూచించారు సోమిరెడ్డి.