ప‌వ‌న్ అడిగితే ఆ సినిమా ఇచ్చేస్తా : చిరు

August 08, 2020

మోహ‌న్ లాల్ హీరోగా న‌టించిన  మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘లూసిఫర్’డబ్బింగ్ వెర్షన్ తెలుగులో రిలీజైనప్పటికీ ఆ సినిమా హక్కులు కొని మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేయడానికి రామ్ చరణ్ రెడీ అయిన సంగతి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ సినిమా రీమేక్ హ‌క్కులు కొని ఆరు నెల‌లు దాటింది. ఐతే ఈ సినిమాను తెలుగులో ఎవ‌రు డైరెక్ట్ చేసేది.. ఎప్పుడు మొద‌లుపెట్టేది ఇంత వ‌ర‌కు వెల్ల‌డించ‌లేదు. మ‌ధ్య‌లో ఏమో లూసిఫ‌ర్ రీమేక్‌లో ప‌వ‌న్ హీరోగా న‌టిస్తాడ‌ని.. ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ప‌వ‌న్‌కైతే బాగుంటుంద‌ని కొంత ప్ర‌చారం న‌డిచింది. ఐతే ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా చిరు దీనిపై ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించాడు. ప‌వ‌న్ అడిగితే ఈ రీమేక్‌ను అత‌డి చేతుల్లో పెట్ట‌డానికి తాను రెడీ అని చిరు చెప్ప‌డం విశేషం.

ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత ఏ సినిమా చేయ‌బోతున్నారు అని చిరును అడిగితే.. ‘‘ఇంకా ఏమీ అనుకోలేదు. ప్రస్తుతం నలుగురైదుగురు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో చెబుతా. నేను చేయబోయే ‘లూసిఫర్‌’ రీమేక్‌కి దర్శకుడు ఎవరనేది నిర్ధారించుకోలేదు’’ అని చిరు చెప్పుకొచ్చాడు. ‘లూసిఫర్‌’ రీమేక్‌ పవన్‌కల్యాణ్‌ చేస్తారని ఇండ‌స్ట్రీలో ఒక టాక్ న‌డుస్తోంది క‌దా అని చిరు ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే.. ‘‘నో... నో! ఆ సినిమా నేనే చేస్తా. తమ్ముడు చేయాలని ఉత్సాహపడితే తప్పకుండా తనకు ఇచ్చేస్తా. తనకు చేయాలనుందనే వార్త అయితే నా వరకూ రాలేదు’’ అని చిరు స్ప‌ష్టం చేశాడు. లూసిఫ‌ర్ రీమేక్‌ను సుకుమార్ చేతుల్లో పెట్టార‌ని.. ఆయ‌న ఒరిజిన‌ల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక వెర్ష‌న్ రాసి ఇచ్చార‌ని ఇంత‌కుముందు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.