ఇంకో నాలుగు కోట్లొస్తే మెగా కుర్రాడు సేఫ్

July 21, 2019

వరుసగా అరడజను ఫ్లాపులతో అల్లాడిపోయిన మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు ఊరట లభించినట్లే. అతను ఎన్నో ఆశలు పెట్టుకున్న కొత్త సినిమా ‘చిత్రలహరి’ హిట్ దిశగా అడుగులేస్తోంది. ఈ చిత్రం తొలి వారాంతంలో మంచి వసూళ్లే సాధించింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో రూ.9.2 కోట్ల షేర్ రావడం విశేషం. తేజు గత సినిమాలతో పోలిస్తే ఇవి చాలా మెరుగైన వసూళ్లే. గత ఏడాది తేజు నుంచి వచ్చిన ‘ఇంటిలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్యూ’ చిత్రాలకు ఫుల్ రన్లో ఇందులో సగం వసూళ్లు కూడా రాలేదు. ‘చిత్రలహరి’ బ్రేక్ ఈవెన్ దిశగానే అడుగులు వేస్తోంది.ఇప్పటికే ఈ చిత్రం 60-70 శాతం దాకా బయ్యర్ల పెట్టుబడిని రివకర్ చేసింది. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ రూ.13.5 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. అంటే ఇంకో రూ.4 కోట్లకు పైచిలుకు షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్లే.

తెలుగు రాష్ట్రాల్లో ‘చిత్రలహరి’కి ఇప్పటిదాకా షేర్ రూ.8 కోట్లు వచ్చింది. దాదాపుగా అన్ని ఏరియాల్లో తొలి వారాంతం మంచి వసూళ్లే వచ్చాయి. యుఎస్‌లో ఈ చిత్రం ఇప్పటిదాకా 2.5 లక్షల డాలర్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే షేర్ రూ.కోటి దాకా ఉంది. అక్కడ బయ్యర్ రూ.1.5 కోట్ల పెట్టుబడి పెట్టాడు. కాబట్టి ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ సాద్యమే అనుకోవచ్చు. వీక్ డేస్‌లో ఈ చిత్రం ఓ మోస్తరుగా వసూళ్లు రాబడుతోంది. రెండో వారాంతం అయ్యేసరికి ‘చిత్రలహరి’ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది.