‘చిత్రలహరి’ మూవీ రివ్యూ

July 21, 2019

బ్యానర్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్

నటీనటులు: సాయిధరమ్ తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పెతురాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, సునీల్‌, వెన్నెల కిశోర్, భరత్ రెడ్డి తదితరులు

మ్యూజిక్: దేవిశ్రీ ప్ర‌సాద్

సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని
ఆర్ట్: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌
ఎడిటింగ్: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
ప్రొడ్యూసర్స్: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సీవీ మోహ‌న్‌
స్టోరీ, డైరెక్షన్: కిశోర్ తిరుమ‌ల‌

మెగా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు సాయి ధరమ్ తేజ్. అయితే, తన అభిమానులకు మాత్రం ఇప్పటి వరకు మెగా హిట్‌ను అందించలేకపోయాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సాయి తేజ్.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘సుప్రీమ్’ సినిమాతో మాస్ ఇమేజ్‌ను కూడగట్టుకున్నాడు. కానీ, ఆ సినిమా తరవాత మరో హిట్టు కొట్టలేకపోయాడు. సుప్రీమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా ఆ బిరుదును నిలబెట్టుకునే హిట్టు కొట్టలేకపోయాడు. ఎన్నో ప్రయోగాలు చేసినా అవి ఫలించడం లేదు. ఇలాంటి సమయంలో ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘చిత్రలహరి’ అనే ఓ ఫీలు‌గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాతోనైనా అతడి నిరీక్షణకు తెరపడిందా..?

కథ
జీవితంలో సక్సెస్ ఎలా ఉంటుందో తెలియని కుర్రాడు విజయ్‌ కృష్ణ (సాయి ధరమ్‌ తేజ్‌). ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడం కోసం అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేడు. దీంతో ఓ విభిన్నమైన డివైజ్‌ను తయారు చేస్తాడు. అయితే, దానిని ప్రమోట్ చేయడం కోసం స్పాన్సర్స్ ఉండరు. దీనికోసం విజయ్ ఎంతో మంది దగ్గరకు వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే లహరి(కల్యాణీ ప్రియదర్శన్‌) పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడిన విజయ్.. అబద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో దింపుతాడు. అయితే, విజయ్ గురించి నిజాలు తెలిసిన తర్వాత ఆమె దూరంగా వెళ్లిపోతుంది. దీంతో విజయ్ మరింత నిరుత్సాహం చెందుతాడు. అలాంటి సమయంలో అతడి జీవితంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఇంతకీ విజయ్ జీవితంలోకి సక్సెస్ వస్తుందా..? లహరితో పాటు విజయం కూడా అతడికి చేరువవుతుందా..? విజయ్‌ జీవితంలోకి స్వేచ్ఛ ఎందుకు వస్తుంది..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
వరుస పరాజయాలతో వెళ్తున్న క్రమంలో సాయి ధరమ్ తేజ్ చేయని ప్రయత్నం లేదు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో మరో కొత్త తరహా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే.. చిత్రలహరి. ‘నేను శైలజ’ వంటి హిట్ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, వాటిని అందుకోవడంలో అటు దర్శకుడుగానీ, ఇటు హీరో గానీ విఫలం అయ్యారనే చెప్పాలి. దర్శకుడు మనిషి ప్రాణానికి సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలను నెమ్మదిగా నడిపారు. అసలు సక్సెస్‌ అంటే ఏంటో తెలియని హీరో, లైఫ్‌లో ఎప్పుడూ సక్సెస్‌ అవ్వని హీరో.. మొదటి సారి సక్సెస్ అయ్యే సీన్స్‌ను ఇంకా బలంగా రాసి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. మెసేజ్ బాగున్నప్పటికీ దాన్ని నడిపిన విధానం బోరింగ్‌గా ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. అయితే, అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటుందా అంటే మాత్రం చెప్పలేం.

నటీనటుల పనితీరు
విజయమనేది చూసి చాలా రోజులు అవడం వల్ల కాబోలు.. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించినట్లు కనిపిస్తుంది. నటనలో గత సినిమాలతో పోలిస్తే కొంచెం మెరుగయ్యడనే చెప్పాలి. విజయ్‌ కృష్ణ అనే పాత్రలో తేజ్ చక్కని నటనను కనబరిచాడు. సీరియస్ యాక్షన్ చేస్తూనే నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక తేజ్ సరసన కథానాయకిగా నటించిన కళ్యాణి ప్రియదర్శన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్‌తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. వారి మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. అలాగే మరో హీరోయిన్ నివేథ పేతురాజ్ నటన కూడా చాలా బాగుంది. ఇక పోసాని, వెన్నెల కిషోర్, సునీల్ తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
మెసేజ్‌తో కూడిన మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ దాన్ని విజయవంతంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కొన్ని సన్నివేశాలను ఎమోషనల్‌గా కిషోర్ తిరుమల బాగా తెరకెక్కించారు. అయితే ఆయన కథనాన్ని ఇంకా బాగా రాసుకోని ఉండి ఉంటే సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకునేది. డీఎస్పీ పాటు పర్వాలేదనిపించినా.. ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

బలాలు
+ దర్శకుడు తీసుకున్న పాయింట్
+ సాయి ధరమ్ నటన
+ కొన్ని ఎమోషనల్ సీన్స్

బలహీనతలు
- కథనం
- బోరింగ్ సీన్స్
- సెంకెండాఫ్

మొత్తంగా: సుప్రీమ్ హీరోకు హిట్ దక్కలేదు

రేటింగ్: 2.25/5

RELATED ARTICLES

  • No related artciles found