క్రిస్మస్ వీకెండ్.. గొడవ గొడవయ్యేలా ఉందే

February 25, 2020

టాలీవుడ్లో సంక్రాంతికి మినహాయిస్తే ఒకేసారి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. దసరాకు కూడా రెండు లేదంటే మూడు సినిమాలు విడుదలవుతుంటాయి. ఇంకే సీజన్లోనూ పేరున్న సినిమాలు రెండు మూడు ఒకేసారి రిలీజ్ కావు. వచ్చే నెల రెండో వారంలో గ్యాంగ్ లీడర్, వాల్మీకి సినిమాల్ని ఒకే రోజు రిలీజ్ చేయాలని ఆ చిత్రాల నిర్మాతలు పోటీకి దిగితే ప్రొడ్యూసర్ గిల్డ్ తరఫున దిల్ రాజు తదితరులు రంగంలోకి దిగి పంచాయితీ చేశారు.

వాల్మీకి చిత్రాన్ని వాయిదా వేయించారు. ఐతే ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఇలాంటి పంచాయితీలేమీ లేకపోవచ్చు. కానీ క్రిస్మస్ పండక్కి ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు పోటీకి సై అంటుండటంతో ఇబ్బంది తప్పేలా లేదు. క్రిస్మస్ వీకెండ్ మిస్సయితే మళ్లీ వేసవి వరకు ఖాళీ ఉండదు. సంక్రాంతికి భారీ చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో దసరా, దీపావళికి రెడీ కాలేని సినిమాల్ని తీసుకెళ్లి క్రిస్మస్ రేసులో నిలబెట్టేస్తున్నారు.
ఆల్రెడీ నితిన్ సినిమా ‘భీష్మ’ను క్రిస్మస్‌‌కు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన 24 గంటల్లోపే మాస్ రాజా రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ను కూడా క్రిస్మస్ కానుకగానే థియేటర్లలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ‘ప్రతి రోజూ పండగే’ను ముందు సంక్రాంతికి అనుకుని.. అక్కడ పోటీ ఎక్కువని భావించి క్రిస్మస్‌కు రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారట. ఇంకోవైపు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘96’ రీమేక్ సైతం క్రిస్మస్‌నే టార్గెట్ చేసింది. ఈ నాలుగూ వేటికవే క్రేజ్ ఉన్న సినిమాలే. ఇలాంటి ఒక స్థాయి సినిమాలు నాల్గింటిని ఒకేసారి రిలీజ్ చేసే పరిస్థితి అస్సలు ఉండవు. కాబట్టి రిలీజ్ డేట్ కోసం వీటి నిర్మాతల మధ్య గొడవ తప్పేలా లేదు. మరి ఆ పంచాయితీని ఎలా తీరుస్తారో ఏమిటో?