మోడీ షార్ట్‌క‌ట్‌..సివిల్స్ రాయ‌కున్న ఐఏఎస్ చేసేస్తార‌ట‌

July 14, 2020

ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్రమోదీ ప‌గ్గాలు చేపట్టిన త‌ర్వాత ప‌లు సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ణాళిక సంఘంను తొల‌గించి నీతి ఆయోగ్ ఏర్పాటు చేయ‌డం ఇందులో ఒక‌టి. అయితే, ఈ వేదిక‌లో ప‌ని చేసేందుకు ప్ర‌ధాని ఇంకో కొత్త అవ‌కాశం తెర‌మీద‌కు తెచ్చారు. నీతి ఆయోగ్‌లో ఖాళీలు ఉన్న నేప‌థ్యంలో ఐఏఎస్‌లుగా ప‌నిచేసేందుకు లేట‌ర‌ల్ ఎంట్రీ స్కీం ప్ర‌వేశ‌పెట్టారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ లో వివిధ స్థాయిల్లో 516 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 54 పోస్టులను లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇలా రిక్రూట్ చేసుకున్న వాళ్లను సాధారణ ఐఏఎస్ ఆఫీసర్ల మాదిరే పరిగణిస్తారు. వీళ్లకూ సేమ్ ర్యాంకు, స్టేటస్, బాధ్యతలు ఉంటాయి. అంటే, సివిల్స్‌తో సంబంధం లేని ఐఏఎస్ అన్న‌మాట‌.

‘నీతి ఆయోగ్’ను దేశ దశ దిశను నిర్దేశించే థింక్ ట్యాంక్‌గా ప్ర‌ధాని మోదీ నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఇతర విభాగాల నుంచి సమాచారం సేకరించి పాలసీల రూప‌క‌ల్ప‌న‌లో నీతి ఆయోగ్ సాయపడుతుంది. దీని కోసం థింక్ ట్యాంక్ లో పని చేసే కన్సల్టెంట్లు అడిగిన సమాచారాన్ని చాలా మంత్రిత్వశాఖలు ఇవ్వడం లేదు. వాళ్ల మాటను సీరియస్ గా తీసుకోవడం లేదు. దీని వల్లే లేటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్‌లను తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. గత ఏడాది 10 జాయింట్ సెక్రటరీ పోస్టులకు విడుదలైన లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ కు 6,077 మంది దరఖాస్తు చేసుకున్నారు. యూపీఎస్‌‌‌‌సీ వడపోత తర్వాత 89 మందిని ఇంటర్వ్యూకి పిలిచింది. అంతిమంగా 9 మందిని ఎంపిక చేసింది. లేటర్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్ స్థాయిలో ఉద్యోగాల్లో చేరే వారి పని తీరును మూడేళ్ల తర్వాత కేంద్రం బేరీజు వేస్తుంది. బావుంటే.. మరో రెండేళ్ల పాటు అదే పొజిషన్ లో కొనసాగిస్తుంది.

ఇక తాజాగా, 54 మంది ప్రైవేట్‌‌‌‌ ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకోనుండ‌గా వీటిలో డైరెక్టర్ స్థాయి నుంచి జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ పోస్టులున్నాయని నీతి ఆయోగ్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ఇంత‌కీ ఇవి ఎప్పుడు భ‌ర్తీ చేస్తార‌నే క‌దా మీ సందేహం. ఈ నెలాఖరులోగా లేదా జులై నెలలో లేటరల్ ఎంట్రీకి నోటిఫికేషన్ వెలువడుతుందట‌. ఇంకేంటి...గెట్ రెడీ.