సీజేఐ బోబ్డే ఎంతకాలం పదవిలో ఉంటారు?

July 15, 2020

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు జస్టిస్ ఎన్ ఏ బోబ్డే. దేశ 47వ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్న ఆయన పూర్తి పేరు జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే. జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ నేపథ్యంలో ఆయనీ పదవిని ఈ రోజు చేపడతారు. పేరు మాదిరే.. ఆయన వ్యవహారశైలి.. భిన్నంగా.. మరింత ఆసక్తికరంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. పని తీరు కూడా అంతేనని చెబుతున్నారు.
కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతిభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన సీజేఐగా పదవీ బాధ్యతల్ని చేపట్టారు. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఆయన తన పదవికి ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టులో బాబ్డేను తన వారసుడిగా చేయాలని ప్రతిపాదించారు రంజన్ గొగోయ్. రంజన్ తర్వాత అత్యంత సీనియర్ ఆయనే.
63 ఏళ్ల బాబ్డే నాగపూర్ లో జన్మించారు. డిగ్రీ పూర్తి చేసిన ఆయన నాగపూర్ వర్సిటీ నుంచి లా డిగ్రీ తీసుకున్నారు. 1978లొ మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో సభ్యుడైన ఆయన.. 1998లో సీనియర్ అడ్వకేట్ గా గుర్తింపు పొందారు. న్యాయమూర్తిగా 2000 మార్చి 29న కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన మనసు ఉండాలని చెప్పే బోబ్డే.. ముక్కుసూటి వ్యక్తిత్వంగా అభివర్ణిస్తారు.
2012 అక్టోబరు 16న మధ్యప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో బోబ్డే కూడా ఒకరు. తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన 17 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2021 ఏప్రిల్ 23న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పదవీ బాధ్యతల్ని చేపట్టారు.