ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నావు జగన్?

May 24, 2020

చేతిలో అధికారం లేన‌ప్పుడు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు తిరుగులేని అధికారాన్ని ఇచ్చిన త‌ర్వాత కూడా అదే ప‌నిగా ఆక్రోశం వ్య‌క్తం చేస్తే దాన్ని చేత‌కానిత‌నం అంటారే త‌ప్పించి మ‌రొక‌టి కాదు. తాజాగా జ‌గ‌న్ ప‌రివారం కొత్త త‌ర‌హా వాద‌న‌ను తెర తీస్తున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భ‌ద్ర‌త విష‌యంలో పోలీసులు నిర్ల‌క్ష్యంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా శుక్ర‌వారం చోటు చేసుకున్న ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌లం పెనుమాక‌లోని హైస్కూల్లో సామూహిక అక్ష‌రాభ్యాసం ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయ‌న త‌ర్వాత ఇంటికి బ‌య‌లుదేరి వెళ్లారు.
ఈ సంద‌ర్భంగా పెనుమాక నుంచి ఉండ‌వ‌ల్లి సెంట‌ర్ మీదుగా తాడేప‌ల్లి వైపుకు వెళుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఉండ‌వ‌ల్లి సెంట‌ర్ నుంచి ప్ర‌కాశం బ్యారేజీ వైపు వెళ్లే వాహ‌నాల్ని వ‌దిలేశారు. దీంతో పెద్ద సంఖ్య‌లో వాహ‌నాలు సీఎం కాన్వాయ్ లో క‌లిసిపోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. చేతిలో అధికారం ఉన్న వేళ‌.. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే సిబ్బంది విష‌యంలోక‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సింది ప్ర‌భుత్వ‌మే.
ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. విప‌క్షంలో ఉన్న‌ట్లుగా ఫిర్యాదు చేస్తే న‌వ్విపోవ‌టం ఖాయం. ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు ఫిర్యాదులు చేయ‌టాన్ని చేత‌కానిత‌నంగా జ‌మ‌క‌డ‌తారే కానీ మ‌రింకేమీ కాదు. సుదీర్ఘ‌కాలం విప‌క్షంలో ఉండ‌టంతో అల‌వాటైన ఫిర్యాదుల తీరును వెంట‌నే మార్చుకోవాల్సిందిగా త‌న అనుచ‌రుల‌కు.. కార్య‌క‌ర్త‌ల‌కు జ‌గ‌న్ చెప్పుకోవ‌టం చాలా అవ‌స‌రం.