కరోనాకు ఆత్మగౌరవం ఎక్కువ - KCR

June 04, 2020

కరోనా గురించి కేసీఆర్ జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, భయపడుతున్నారు కూాడా. అందులో ఏం తప్పుకూడా లేదు. భయపడాలి. ఇపుడు కరోనాకు భయపడకపోతే రేపు మనమంతా చావుకు భయపడాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాభా ఉంది. కానీ అందులో ఒకటో వంతు బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే 10 లక్షల మంది కంటే ఎక్కువ మందికి కరోనా వస్తే చేతులెత్తేయడం తప్ప ఏం చేసే పరిస్థితి ఉండదు. అందుకే కరోనాకు భయపడాలి.

ఈరోజు కరోనా గురించి ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటుచేసిన కేసీఆర్ కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు సహకరించాలని విజ్జప్తి చేశారు. ప్రజల సహకారం ఉంటేనే దీన్ని నివారించగలం అన్నారు. కరోనాకు ఆత్మగౌరవం ఎక్కువ. మనంతట మనం చేయిపట్టుకుని పిలిస్తే తప్ప అది మనవద్దకు రాదు. కాబట్టి మీరు దానిని చేయి పట్టుకుని పిలవద్దు. దండం పెట్టి పంపేయండి అంటూ చమత్కారంగా అవగాహన కల్పించారు. 

విదేశాల నుంచి వచ్చిన వారు దయచేసి ప్రభుత్వానికి తెలపాలని ... మీరు కొంతకాలం మాత్రమే దాక్కోగలరు. శాశ్వతంగా దాక్కోలేరు. మీ వల్ల మీ కుటుంబం, మీ సమాజం ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు సహకరించాలి. మిమ్మల్నేమీ అరెస్టు చేయం కదా. కేవలం వ్యాధి ఉంటే... చికిత్స చేస్తాం. ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. దయచేసి మీరు ఇగ్నోర్ చేయొద్దు. మీకు దండం పెడతాం. మాకు చెప్పండి. పరీక్షలు చేయించుకోండి. సమాజాన్ని కరోనా నుంచి కాపాడండి అని కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు. 

ప్రధాని మోదీ చేసిన జనతా కర్ఫూ ను 14 నుంచి 24 గంటలకు పెంచారు కేసీఆర్. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని కేసీఆర్ కోరారు. ఇది మా కోసం కాదు, మనకోసం. జనతా కర్ఫ్యూ వల్ల కొంతయినా చైన్ బ్రేక్ చేయగలం. దయచేసి ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు అని కేసీఆర్ విజ్జప్తి చేశారు.  

ఈ కార్యక్రమానికి పరిమితంగా మీడియా సిబ్బందిని ఆహ్వానించారు. వారికి మీటరు దూరం తేడాతో కుర్చీలు వేసి జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.

 Image