లడఖ్ - చైనా ఘర్షణలో చనిపోయిన అధికారి తెలుగువాడు !!

August 14, 2020
CTYPE html>
విషాదానికే విషాదం ఇది. లడఖ్ పరిధిలోని చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో  ఇరు బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక సైనిక అధికారి, ఇద్దరు సైనికులు చనిపోయిన విషయం విని ఉదయం భారతీయులు ఎంతో వేదన చెందారు. చైనా వికృత చేష్టలకు, సామ్రాజ్యా దాహానికి అన్యాయంగా ఇరు దేశాల సైనికులు బలవుతున్నారు. 
అయితే... ఈ రోజు ఘర్షణలో చనిపోయిన సైనికాధికారి మన తెలుగు వాడు కావడం మరింత శోచనీయం. నిన్న రాత్రి జరిగిన ఈ ఘర్షణ గురించి ఉదయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చైనా సైనికులు కూడా గాయపడ్డారని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ గొడవలో చనిపోయిన తెలుగు అధికారి సూర్యపేట వాసి అయిన సంతోష్. 
ఆర్మీ అధికారులు సంతోష్ కుటుంబానికి సమాచారం పంపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త సంతోష్ భార్య పిల్లలను శోకసంద్రంలో ముంచింది. సంతోష్ పిల్లు ఇద్దరు పదేళ్ల లోపు వారే. చక్కటి కుటుంబాన్ని చైనా గొడవ కబళించింది. సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌.. భార్యాపిల్లలు సూర్యాపేట జిల్లా కేంద్రం లోని విద్యానగర్ లో ఉంటున్నారు. సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.
 
ప్రపంచమంతా ఏకమై చైనాను తప్పు పడుతున్న కూడా చైనా తన నీచ బుద్ధిని చాటుకుంటోంది. ఈరోజు జరిగిన ఘటన అనంతరం #WeakestPMModi అంటూ సోషల్ మీడియా కూడా నినదించింది. చైనాకు ఎపుడు బుద్ధి చెబుతారు ప్రధాని మోడీ అని జనం నిలదీస్తున్నారు. ఇటీవలే చర్చలతో సరిహద్దు సమస్య పరిష్కారం అయ్యిందనుకుంటే అంతలోపు మరోసారి చైనా మరో ముగ్గురు మరణానికి కారణమైంది. 
ఈ విషాద వార్తతో సూర్యపేట ఉలిక్కిపడింది. విషణ్ణ వదనాలతో సంతోష్ కు  ప్రగాఢ సానుభూతి తెలిపింది. సూర్యాపేట వాసులు పెద్ద సంఖ్యలో వారి ఇంటికి చేరుకున్నారు. పిల్లలకు పదేళ్లు కూడా నిండకుండానే తండ్రి దూరం కావడం పట్ల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మొత్తం తెలంగాణనే ఈ వార్త కంటతడి పెట్టిస్తోంది.