నాడు శాసించిన పార్టీలే నేడు యాచిస్తున్నాయా..!

February 27, 2020

ఒక‌ప్పుడు రాజ‌కీయాల‌ను శాసించిన క‌మ్యూనిస్టులు.. ఇప్పుడు యాచించే స్థాయికి దిగజారి పోయారు అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అందుకే పాపం తెలంగాణ‌, ఏపీలో క‌మ్యూనిస్టుల ప‌రిస్థితి చూస్తే జాలేస్తుంది. అయితే ఏపీలో మాత్రం క‌మ్యూనిస్టులు ప‌రిస్థితి ఇంకా ద‌య‌నీయంగా ఉంది. తెలంగాణ‌లో త‌మ ఉనికిని నిలుపుకుంటున్న‌ప్ప‌టికి ఏపీలో మాత్రం ద‌య‌నీయంగా మారింది. ప్ర‌తి సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టుల పొత్తు కోసం పాకులాడేవి ఇత‌ర రాజ‌కీయ పార్టీలు. కానీ ఇప్పుడు అదే క‌మ్యూనిస్టులు పొత్తుల కోసం ఇత‌ర పార్టీల వైపు బిక్క‌చూపులు చూస్తున్నాయి. గ‌తంలో క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పొట్టుకుని టీడీపీ అనేక‌సార్లు అధికారంలోకి వ‌చ్చింది. 
అంతే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా అటు కేంద్రంలో, ఇటు ఉమ్మ‌డి ఏపీలో అధికారంలోకి వ‌చ్చింది. క‌మ్యూనిస్టుల అండ‌తో అధికారంలోకి వ‌చ్చిన పార్టీలు ఇప్పుడు త‌న ఉనికిని నిలుపుకుంటుంటే.. ఎంతో ప్రాబ‌ల్యం క‌లిగిన క‌మ్యూనిస్టులు మాత్రం రోజు రోజుకు దిగ‌జారిపోతున్నారు. టీడీపీని, కాంగ్రెస్‌ల‌ను శాసించిన స్థాయిలో ప్రాబ‌ల్యం ఉన్న క‌మ్యూనిస్టులు ఇప్పుడు పొత్తుల కోసం అర్రులు చాస్తున్నారు. క‌మ్యూనిస్టులు చేసే ప్ర‌జా ఉద్య‌మాలు కూడా కార్మికులు ప‌క్షం ఉండేవి. క‌మ్యూనిస్టులు స్వంతంత్రంగా ఉద్య‌మాల‌కు పిలుపునిస్తే ఇత‌ర రాజ‌కీయ పార్టీలు, ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌మ్యూనిస్టుల‌కు స‌పోర్టు చేసేవి.
క‌మ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఐఎం పార్టీలు ప్ర‌జా ఉద్య‌మాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చేవి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై నిత్యం పోరాటం చేస్తూ ప్ర‌జా క్షేత్రంలో ఉండేవి. ప్ర‌జాస్వామ్యంలో ఉన్న అన్ని రంగాల్లో క‌మ్యూనిస్టులు త‌మ సంఘాల‌ను ఏర్పాటు చేసుకుని వాటితో త‌న పోరాటాల‌ను నిరంతరం చేసేవి. క‌మ్యూనిస్టులు పోరాటాల‌కు పిలుపు నిచ్చారంటే అది ఎంతో ప్రాధాన్య‌త సంత‌రించుకునేది.  కానీ ఇప్పుడు కాలం క‌లిసి రావ‌డం లేదు అన‌డం కంటే ఆ పార్టీల‌ నాయ‌క‌త్వం అగ్ర‌కులాల‌కు చెందిన నేత‌ల చేతుల్లో ఉండ‌డంతో పేద ప్ర‌జ‌ల క‌ష్టాల కోసం ఉద్య‌మించడం మానేసి అగ్ర కులాల పార్టీల నేత‌ల‌కు ఊడిగం చేస్తున్నారు అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వ ప‌రిస్థితులు చూస్తుంటే అదే నిజ‌మ‌నిపిస్తుంది.
ప్ర‌జా ఉద్యమాలు విస్మ‌రించి ఇప్పుడు ఏపీలో జ‌న‌సేన ఇస్తున్న ఉద్య‌మాల‌కు ఊపిరి పోస్తున్నారు క‌మ్యూనిస్టు పార్టీలు. అంతే కాదు గ‌త ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన పార్టీకి తోక పార్టీలుగా మారాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే.. ఏపీలో క‌నీసం ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకున్న దాఖాలాలు కాన‌రాలేదు. అంటే క‌మ్యూనిస్టులు కేవ‌లం త‌మ ఉనికి కోసం త‌ప్పితే.. కార్మికుల ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేస్తున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. అంటే త‌మ ఉనికి కోసం ప్రెస్‌మీట్లు, మీడియా స‌మావేశాలు, ఇత‌ర పార్టీలు ఇచ్చే ఉద్య‌మాల్లో పాల్గొన‌డం త‌ప్పితే ఆ పార్టీలు పెద్ద‌గా చేసింది ఏమీ లేద‌నే చెప్ప‌వ‌చ్చు.
ఏదేమైనా ఏపీలో క‌మ్యూనిస్టులు ఇలాగే తోక పార్టీలుగా ఉంటే రాబోవు రోజుల్లో  క‌నుమ‌రుగు కావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇక‌నైనా క‌మ్యూనిస్టులు త‌మ ప్రాబ‌ల్యం పెంచుకునేందుకు ప్ర‌జా ఉద్య‌మాల‌తో ముందుకు పోతారో.. లేక ఇక ఇలాగే జ‌న‌సేన లాటి చిన్నా చిత‌కా పార్టీల‌కు ఊతం ఇస్తూ ఉనికిలో లేకుండా పోతారో క‌మ్యూనిస్టులే తేల్చుకోవాలి.