ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా !!

August 08, 2020

పుట్ట పగిలి చీమలు బయటకు వచ్చినట్టు తెలుగు రాష్ట్రాల్లో కేసులు బయటకు వస్తున్నాయి. ప్రతి రోజు ఒక రాష్ట్రానికి మించి మరో రాష్ట్రంలో కేసులు బయటపడుతున్నాయి. గత వారం రోజులుగా తెలంగాణ ప్రతి రోజు కొత్త రికార్డులు  సృష్టిస్తోంది. దేశంలో కమ్యూనిటీ వ్యాప్తి ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందని తాజాగా వచ్చిన ‘‘ఇండియన్ పిక్సల్స్‘‘ సంస్థ వెల్లడించిన సర్వే వివరాలకు అనుగుణంగానే తెలంగాణలో ఫలితాలు బయటపడుతున్నాయి.

తాజగా ఈరోజు తెలంగాణలో కొత్త గా నమోదైన పాజిటివ్ కేసులు  872 నమోదు కాగా ఏడుగురు మరణించారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డు. తాజా కేసులతో మొత్తం కేసులు -8674కి చేరాయి.  ఆక్టివ్  కేసుల (4452) కంటే డిశ్చార్జ్ కేసులు సంఖ్య తగ్గిపోతు ఉండటం మరో ప్రమాద ఘంటిక. నేటితో తెలంగాణ మొత్తం మరణాల సంఖ్య 217 కు చేరింది.

ఇందులో కీలక మైన విషయం ఏంటంటే...3189 టెస్టులకే 872 కేసులు రావడం తీవ్రతకు అద్దం పడుతోంది. అదే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువ కేసులు వస్తున్నా... 20 వేలకు పైగా రోజుకు టెస్టులు చేస్తుంటే కేసులు వందల్లోనే ఉంటున్నాయి. అంటే... తెలంగాణలో చాలా తీవ్రంగా వ్యాపించిందనడానికి ఇదొక ఉదాహరణ. ఆలస్యంగా టెస్టులు చేయడమే దీనికి కారణం కావచ్చు.

ఈరోజు ఏపీలో 16704 మందికి పరీక్షలు చేస్తే 392 మందికి పాజిటివ్ అని తేలింది. పర్సెంటేజీ పరంగా చూసినపుడు ఏపీలో కేసులు బానే బయపడుతున్నా భారీ టెస్టింగ్ వల్ల పరిస్తితులు చాలా వరకు అదుపులో ఉన్నట్లు అర్థమవుతోంది.

వివిధ రాష్ట్రాలకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు 


ఢిల్లీ -143%
తెలంగాణ - 122%
మహారాష్ట్ర - 65%
గుజరాత్ - 45%
తమిళనాడు - 38%
ఉత్తరప్రదేశ్ - 18%
కర్ణాటక - 8%
ఆంధ్రప్రదేశ్- 8%
కేరళ -0.7%