కాంగ్రెస్ అందరికంటే ముందే ఉందిగా..!

April 02, 2020

దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం మరీ దగ్గర పడటంతో అన్ని పార్టీలు అలెర్ట్ అవుతున్నాయి. తమ తమ అభ్యర్థుల విషయమై కసరత్తులు చేస్తున్నాయి. అయితే ఈ కసరత్తుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా ఉందనేది తాజా సమాచారం. అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలను వేగంగా రెడీ చేసేస్తోంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా రాకుండానే కాంగ్రెస్ పార్టీ అధికారిక జాబితా విడుదల మొదలుపెట్టింది. జాతీయ స్థాయిలో ఏఐసీసీ ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసేయడం విశేషం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పదకొండు స్థానాలకు, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి నాలుగు ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ మేరకు మొత్తం  పదిహేను స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసేసింది కాంగ్రెస్.

 

ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల పేర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయబరేలీ నుంచి సోనియా, అమేథీ నుంచి రాహుల్ యథారీతిన పోటీ చేస్తారని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. సోనియా ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చునేమో అని ఇన్నాళ్లుగా జనంలో ఉన్న సందేహాలను కాంగ్రెస్ పార్టీ పటాపంచలు  చేసింది. రాయబరేలీ నుంచి ఆమె పేరును అనౌన్స్ చేసింది. ఇక రాహుల్ అమేథీ నుంచి పోటీ ఖాయమైంది. మరి కేవలం వీరు అంతటితో ఆగుతారా లేక మరో స్థానం నుంచి కూడా పోటీ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇక ప్రియాంక పోటీ విషయంలో కూడా మిస్టరీ కొనసాగుతూ ఉంది. ప్రియాంక ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయడం ఖామయనే  ప్రచారం జరుగుతూ ఉంది. ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్ తో పొత్తుకు నో చెప్పేయడంతో యూపీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేయబోతోంది. దీంతో అక్కడ ముందుగానే అభ్యర్థులను ప్రకటించుకుంది కాంగ్రెస్.

 

ఇంకా ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన స్టార్ట్ అయింది. రాష్ట్రంలో పార్టీపై ఎలాంటి అంచనాలు లేనప్పటికీ అభ్యర్థుల ప్రకటన విషయంలో మాత్రం కాంగ్రెస్ స్పీడ్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తమ తొలి అభ్యర్థిని ప్రకటించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి అశ్వర్థ నారాయణ తమ పార్టీ తరఫున పోటీ చేస్తారని రఘువీర ప్రకటించారు! ఆయన పేరునే తొలి అభ్యర్థిత్వం విషయంలో ఖరారు చేశారు. దీంతో కాంగ్రెస్ అడుగులు చాలా వేగంగా పడుతున్నాయే అనే కోణంలో జనంలో చర్చలు జరుగుతున్నాయి.