అయ్యో పాపం ... కాంగ్రెస్

July 08, 2020

కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కోపం స్థానంలో జాలి వేస్తుంది. అసలు దేశంలో ఇంత వెనుకబాటు తనానికి, అల్లర్లకు వివాదాలకు కాంగ్రెస్ ఓటు రాజకీయమే కారణం. సంపూర్ణ మెజారిటీ ఉన్న సమయాల్లోనూ సరైన చట్టాలు చేయకుండా స్కాములు, కీర్తి కాంక్షలతో కాలం గడిపేసిన కాంగ్రెస్ కు కశ్మీర్ విభజన బిల్లు... మరణ శాసనం రాసినట్టయ్యింది. ఆ పార్టీ పరిస్థితి ఎంత దారునంగా ఉందంటే... సోమవారం సభలో బిల్లు పెడతే దానిపై అందరూ సెల్ఫ్ గోల్ వేసుకున్నాక మంగళవారం మీటింగ్ పెట్టుకుని ఎవరు ఏం మాట్లాడాలో నిర్ణయించుకుంది. అయినా పరిస్థితి మారలేదు. సోమ, మంగళ రెండు రోజుల్లో కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించని తీరు ఆ పార్టీ ఇక దేశంలో అవుట్. తిరిగి కోలుకునే పరిస్థితే లేదు అనే స్థితికి తెచ్చాయి. ఐదారు మంది కాంగ్రెస్ నేతలు స్పందించిన తీరు కాంగ్రెస్ ను అల్లకల్లోలం చేసింది. వారి స్పందన విన్నాక కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ కావాలనే కశ్మీర్ ను పాక్ అదుపులో ఉంచారేమో అనేంత అనుమానం వచ్చింది. కాంగ్రెస్ సభ్యుల వ్యాఖ్యలు ఒక్కోటీ గమనిస్తే...

అజాద్, రాజ్యసభ ఫ్లోర్ లీడర్
మిగతా కాంగ్రెస్ వాళ్లు కనీసం విధానాన్ని వ్యతిరేకిస్తే... ఈయన 370 రద్దును పూర్తిగా వ్యతిరేకించారు. బేసిక్ గా అజాద్ కశ్మీరీ కావడం ఒక కారణమైనా... ఈయన వ్యాఖ్యలు దేశప్రజలకు కాంగ్రెస్ ని అసహ్యించుకునేలా చేశాయి.

అధీర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ లోక్ సభ ఫ్లోర్ లీడర్
‘‘నాకో సందేహం..ఇది (జమ్మూ కశ్మీర్‌) ఆంతరంగిక వ్యవహారమని మీరు అంటున్నారు. 1948 నుంచీ కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తూనే ఉంది. అలాంటపుడు ఇది అంతర్గతం ఎలా అవుతుంది? మనం (పాక్‌తో) సిమ్లా ఒప్పందం కుదుర్చుకున్నాం... లాహోర్‌ డిక్లరేషన్‌ కూడా చేశాం. మరి అలాంటపుడు ఇది మనదేశానికి సంబంధించిన సమస్యే అని అనగలమా? ద్వైపాక్షికం కాదా? ఇది ద్వైపాక్షికాంశమని, మీరు జోక్యం చేసుకోవద్దని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియోకు మన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌ ఈ మధ్యే తెలియపర్చారు. ఇంత జరిగాక కూడా ఇది ఆంతరంగికమెలా అవుతుంది? దీన్ని వివరిస్తారా?..’’ లోక్‌సభలో విపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి అన్న ఈ మాటలతో కాంగ్రెస్ అధినేతలు సోనియా రాహుల్ విస్మయానికి గురయ్యారు. నువ్వు పాకిస్తాన్ మనిషిలా మాట్లాడుతున్నావేంట్రా బాబు అన్నట్టూ ఆయన వైపు చూశారు. దొరికిందే సందు అని అమిత్ షా కాంగ్రెస్ ను ఆడేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సోనియా గాంధీ రంజ‌న్ చౌధురికి చీవాట్లు పెట్టారు. స‌భా సాక్షిగా పార్టీ ప‌రువు తీసారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అయితే, అప్పటికే చాలా డ్యామేజ్ అయ్యింది.

మనీష్ తివారీ, సీనియర్ కాంగ్రెస్ ఎంపీ
‘‘ఈ బిల్లు తెస్తే మరి జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక రాజ్యాంగం ఏమవుతుంది? అసలు ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తీసుకోకుండా రాష్ట్రాన్నెలా విభజిస్తారు?’’ అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగలేదు. ఎరికా లియోనార్డ్‌ జేమ్స్‌ రాసిన ‘ఫిఫ్టీ షేడ్స్‌ ఆఫ్‌ గ్రే’ అనే శృంగార ఆంగ్ల నవలను ప్రస్తావించి మరో తప్పు చేశారు. అసలు కశ్మీర్ విభజన చేసిందే... ప్రత్యేక రాజ్యాంగం ఉండకూడదు అని, అన్నిటికీ ఆ అసెంబ్లీ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది అని. అలాంటి పోయిపోయి అదే అసెంబ్లీని విభజించాలా? వద్దా? అని అడిగితే... కశ్మీర్ అసెంబ్లీ విభజించమని చెబుతుందా? అన్న బేసిక్ ప్రశ్నకు పిల్లాడు కూడా సమాధానం చెబుతారు. అసలు దేశంలో ఒక సామాన్య పౌరుడి మనసు ఏంటో కాంగ్రెస్ కు అంతుపట్టడం లేదు. ఇదిలా ఉంటే... ఉమ్మడి ఏపీ అసెంబ్లీ అభిప్రాయాన్నిఆనాడు కాంగ్రెస్ పరిగణించలేదు అనే విషయం మనీష్ తివారి గుర్తుంచుకోవాలి.

ఇదిలా ఉండగా... పార్టీకి వ్యతిరేకింగా... భారత్ నిర్ణయానికి అనుకూలంగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడటం ద్వారా కాంగ్రెస్ తప్పులు ఇంకా హైలైట్ అయ్యాయి. అయితే, వీరు మాత్రం సేఫ్ జోన్లోకి వెళ్లపోయారు.

అదితి సింగ్, రాయ్ బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే
పార్లమెంటు నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఒక భారతదేశపు పౌరురాలిగా, ఎమ్మెల్యేగా కశ్మీర్ విభజన, రాజ్యాంగ విలీనంపై నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను అని అదితి సింగ్ ప్రకటించారు. ఆమె సోనియాగాంధీ కుటుంబ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడం విశేషం.

జ్యోతిరాదిత్య సిందియా, ఎంపీ, కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ
కశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారత్‌లో విలీనం చేయడాన్ని, కశ్మీర్ విభజనకు నేను మద్దతు తెలుపుతున్నా. ఐతే రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి ఉంటే బాగుండేది. అప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి కావు. ఏదేమైనా.. దేశం కోరుకుంటున్నది ఇదే. అందుకే నేను మద్దతు ఇస్తున్నా... అంటూ సింధియా సంచలనం అయ్యారు.

భువనేశ్వర కలిత, కాంగ్రెస్ విప్, రాజ్యసభ
సభలో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే.. దానిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. సభ్యులందరూ వ్యతిరేకంగా ఓటేయాలని విప్ జారీచేయమని పార్టీ విప్ భువనేశ్వర్ కలితకు ఆదేశించింది. ఏం పార్టీ ఇది... దేశం కోరుకుంటున్న దానికి విరుద్ధంగా చేయమంటారా? అధిష్టానం కాంగ్రెస్ పార్టీని బతికించాలనుకోవడం లేదు, చంపేయాలనుకుంటోంది అంటూ ఆయన వ్యాఖ్యానిస్తూ... పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి, విప్ పదవికి రాజీనామా చేసేసి సంచలనం అయ్యారు.


వీటన్నింటిని చూస్తుంటే... కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఏ అంశంపైన ఒక స్పష్టమైన అభిప్రాయం లేదు. గాలి వాటం పడవలో ఏదైనా సందర్భం వచ్చినపుడు స్పందించడం మాత్రమే చేస్తోంది. అంతేగాని... దేశ సమస్యలు, వాటిపై అనుసరించిన విధానాల గురించి పార్టీకి శ్రద్ధ గాని, ఆసక్తి గాని ఉన్నట్టు కనిపించడం లేదు. బహుశా దేశంలో కాంగ్రెస్ అధికార పీఠాన్ని ఎక్కడం దాదాపు అసాధ్యం అనిపించే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి.