బోణీ కొట్టిన కాంగ్రెస్‌

August 10, 2020

తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ది వింత ప‌రిస్థితి.  2014లో తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న చేయ‌డం వ‌ల్ల రెండు ప్రాంతాల్లో ల‌బ్ది పొంద‌వ‌చ్చ‌ని భావించింది. కాని ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ను వ్య‌తిరేకించారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చిన‌ప్ప‌టికి తెలంగాణ వాసులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించ‌లేక‌పోయారు. దీంతో డీలా ప‌డ్డ కాంగ్రెస్ 2018లో తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌లు క‌లిసి వ‌స్తాయ‌ని ఆశ‌లు పెట్టుకుంది. కాని  సెంటిమెంట్ పెర‌గ‌డంతో తెలంగాణ వాసులు మ‌రోసారి టీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపించారు. ఇక కాంగ్రెస్ ఆశ‌ల‌న్నీ ఏపీపైనే పెట్టుకుంది. అందుకు ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ రాహుల్ గాంధీ ప‌దే ప‌దే హామీ ఇస్తున్నారు. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో 2014 ఎన్నికల్లో పూర్తిగా డీలా పడిపోయిన కాంగ్రెస్.. 'ప్రత్యేక హోదా' సంజీవనితో ఏపీలో పార్టీని బ్రతికించుకోవాలనుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించాలని భావిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ.. ఎన్నికల్లో ఒంటరి పోరుకి సిద్ధమవుతోంది.

దానిలో భాగంగానే తమ పార్టీ తరుపున ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని తాజాగా కాంగ్రెస్ ప్రకటించింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది హరేసముద్రం అశ్వద్ధ నారాయణ బరిలోకి దిగుతారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. నారాయణ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెలాఖరులోగా అన్ని అసెంబ్లీలకూ అభ్యర్థులను ప్రకటిస్తామని రఘువీరారెడ్డి వెల్లడించారు. మరి 2014 ఎన్నికల్లో  ఓటు బ్యాంకు వ‌ద్ద చితికిల ప‌డ్డ కాంగ్రెస్ ఈ సారైన బోణి కొడుతుందా లేదా అన్న‌ది మ‌రో రెండు నెల‌ల గ‌డిస్తే కాని చెప్ప‌లేం.