హస్తం భూ స్థాపితమేనా..? ఇదీ తాజా పరిస్థితి

July 15, 2019

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు కాంగ్రెస్ తరపున చక్రం తిప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా హస్తానిదే పై చేయి ఉండేది. అలాంటి కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఇప్పుడు పాతాళంలోకి కూరుకుపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి ఒక్క బలమైన నేత కూడా లేకపోవడం కాంగ్రెస్ వెన్ను విరిచినంత పని చేసింది. ఇటీవల తెలంగాణలో మహాకూటమి పేరుతో బరిలోకి దిగినా ఆ పార్టీని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక నిన్న గాక మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ది ఇంచుమించుగా ఇదే పరిస్థితి!

ఉమ్మడి ఏపీలో చివరగా రెండు సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి 2019 ఎన్నికల తర్వాత దారుణంగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో పోలింగ్ సరళి చూశాక ఇక బలపడడం సాధ్యంకాదన్న అంచనాలు కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయట. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తన ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ వచ్చింది. 2014లో భూస్థాపితమైన కాంగ్రెస్ 2019లో కాస్తయినా కోలుకోవచ్చని భావించారంతా. కానీ మరోసారి సీన్ రివర్స్ అయినట్లు సంకేతాలొస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో హస్తం ముఖం చూసిన నాధుడే లేడనే టాక్ బలంగా వినిపిస్తోంది. నిజానికి టీడీపీతో పొత్తు పొడవడంతో పొత్తులతో కాంగ్రెస్ మార్క్ కనపడుతుందని ఆశపడ్డారు ఆ పార్టీ నేతలు. కానీ చంద్రబాబు మాత్రం.. తీరా ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో మాత్రమే పొత్తుకు సై అనడం ఏపీలో కాదనడంతో ఒంటరిపోరుకు కాంగ్రెస్ రెడీ కావాల్సి వచ్చింది. తెలంగాణలో పొత్తుపెట్టుకొని దెబ్బతిన్న బాబు ఏపీలో ఆ మాట ఎత్తలేదు. ఇదే సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేతలను బాబు లాగేయడంతో కాంగ్రెస్ మరింత కూరుకుపోయింది.

ఇక ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నేతల పరిస్థితి చూస్తే ఇలా ఉంది. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉలుకూ పలుకూ లేకుండా సైలెంట్ అయ్యారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమాలే తప్ప కాంగ్రెస్ ని పట్టించుకునే స్థితిలో లేరు. కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాత్రమే కాస్తో కూస్తో మేలుగా అనిపిస్తున్నారు. రఘువీరారెడ్డి తర్వాత జేడీ శీలం.. పల్లం రాజు కాస్త యాక్టివ్ గా ఉన్నారు. ఇక సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నా కూడా అంత చురుగ్గా పార్టీలో వ్యవహరించడం లేదు. దీంతో కోమాలో ఉన్న పార్టీకి ముగ్గురు లేదా నలుగురు నేతల వల్ల పార్టీకి ఒరిగేదేమీ కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ పరిస్థితులు చూసి.. ఇక ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం హస్తం భూ స్థాపితమే! అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.